ఊయల మహత్యం

 

పెద్దవాళ్లకి అట్లతద్ది రోజునే ఊయల గుర్తుకువస్తుందేమో! కానీ పిల్లలు మాత్రం ఏడాది పొడవునా ఊయలను తలుచుకుంటూనే ఉంటారు. గంటల తరబడి ఊయల ఊగమన్నా సిద్ధంగా ఉంటారు. ఇంతకీ ఊయలలో అంత మహత్యం ఏముంది! సాదాసీదాగా కనిపించే ఊయలతో మన ఆరోగ్యానికి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే లేకేం అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు నిపుణులు...

 

సంతోషం- నిదానం

ఊయల ఒక చిత్రమైన సింహాసనంలాంటిది. మరీ ఉద్విగ్నంగా ఉన్నవారు ఊయల ఊగితే ప్రశాంతతను పొందుతారు. అదే సమయంలో నిర్లిప్తంగా ఉన్నవారు ఊయల ఊగితే కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. అంటే మనిషి మనఃస్థితిని బట్టి వారికి అనుగుణమైన అనుభూతి లభిస్తుందన్నమాట. ఊయలూగుతూ ముందుకీ వెనక్కీ కదలడం వల్ల, మన అంతర్‌ చెవిలో జరిగే ప్రక్రియ వలన ఇలా జరుగుతుందట.

 

కంటిచూపు మెరుగు

పిల్లల్లో చూపు స్థిరపడటం ఒక సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా టీవీ వంటి సాధనాల ముందు అతుక్కుపోయి ఉన్నప్పుడు వారి కంటికి ఎలాంటి వ్యాయామమూ లభించదు. దీనికి విరుద్ధంగా ఊయల ఊగడం వలన వారి చూపు బలపడుతుందని భావిస్తున్నారు. ఊయల ఊగే సమయంలో పిల్లవాడి దృష్టి కేంద్రీకరించాల్సిన దృశ్యం మారుతూ ఉంటుంది. ఇది కంటికి ఒక గొప్ప వ్యాయామంలాగా పనిచేస్తుంది. ఏకాగ్రత అలవడుతుంది. ఇదే ఏకాగ్రత చదువులో కూడా ఉపయోగపడుతుందంటున్నారు. బడిలో భోజన విరామంలో ఊయల ఊగిన పిల్లలు తరువాత జరిగిన తరగతిలో పాఠాలకు బాగా ఒంటపట్టించుకున్నట్లు ఓ పరిశోధనలో కూడా తేలింది.

 

వ్యాయామం

ఊయల ఊగేటప్పుడు శరీరంలోని ప్రతి అవయం మీదా ఒత్తిడి ఉంటుంది. బలంగా ఊపిరి పీల్చుకుని వదలడం, చేతులతో ఊయలను గట్టిగా పట్టుకోవడం, కాళ్లను నేలకి తొక్కి పెట్టి తిరిగి లేవడం, వెన్నుని నిటారుగా ఉంచడం, తలని బ్యాలెన్స్ చేసుకోవడం... ఇలా శరీరంలోని అన్ని అవయవాలకూ తగిన వ్యాయామం లభిస్తుంది. గంటసేపు కనుక ఊయల ఊగితే ఏకంగా 200 కేలరీలు ఖర్చవుతాయని ఓ అంచనా!

 

సమన్వయం

సాధారణంగా మనం ఐదు ఇంద్రియాల గురించే మాట్లాడుకుంటాము. కానీ మన శరీరంలో Proprioception మరియు Vestibular system అనే రెండు వ్యవస్థలు ఉంటాయి. వీటి ఆధారంగా మన శరీరం ఏ భంగిమలో ఉంది? మన కదలికలు ఎటువైపుగా సాగుతున్నాయి? అని మన మెదడు నిర్ధారిస్తుంది. పిల్లల్లో ఈ వ్యవస్థ అభివృద్ధి చెందకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊయలతో అటూఇటూ ఊగడం వలన ఈ రెండు వ్యవస్థలనీ ప్రేరేపించినట్లు అవుతుంది. తద్వారా వారి శరీరంలో సమతుల్యమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

 

కాబట్టి పెద్దలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకుకే కాదు, పిల్లల్లో మానసికశారీరిక వికాసానికి కూడా ఊయల ఊగడం గొప్ప ఫలితాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అందుకనే ఆటిజం వంటి ఎదుగుదలకి సంబంధించిన సమస్యలున్న పిల్లల్ని ఊయల ఊగించాలంటూ ప్రోత్సహిస్తున్నారు.

 

- నిర్జర.