గుండె బాగుండాలంటే చాక్లెట్‌ తినండి

 

సైన్స్ పరిశోధనలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక రోజు కాఫీ మంచిది కాదన్న పరిశోధన బయటకు వస్తుంది. ఆ పరిశోధనని అనుసరించి మర్నాడు ఓ లోటాడు కాఫీ తాగుతూ దినపత్రికని చదవడం మొదలుపెడతామా.... కాఫీ ప్రాణాంతకం అని మరో పరిశోధన కనిపిస్తుంది.  ఏ పరిశోధనని ఎంతవరకూ నమ్మాలో తెలియని అయోమయంలో జనం ఉండిపోతారు. కానీ డార్క్‌ చాక్లెట్ల గురించి చాలా రోజులుగా మంచి విషయాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వెలువడిన ఓ పరిశోధన డార్క్‌ చాక్లెట్లు గుండెజబ్బుల నుంచి కాపాడుతుందని ఘంటాపథంగా చెబుతోంది.

 

ఇంతకీ డార్క్ చాక్లెట్‌ అంటే

 

డార్క్‌ చాక్లెట్‌ పూర్తిగా కోకో గింజల నుంచే తయారుచేస్తారు. ఇందులో పాలపదార్థాలు కానీ, కోకో గింజల నుంచే ఉత్పత్తి అయ్యే ‘కోకో బటర్’ కానీ చాలా తక్కువగా కనిపిస్తాయి. దీనికి విరుద్ధంగా మనకి బజార్లో ఎక్కువగా దొరికే ‘మిల్క్‌’ లేదా ‘వైట్‌’ చాక్లెట్లలో కోకో బటర్‌ లేదా పాలపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే రంగు, రుచి, వాసనల్లో ఏది సాధారణ చాక్లెట్టో ఏది డార్క్‌ చాక్లెట్టో పసిగట్టేయవచ్చు. నలుపు రంగులో, కాస్తంత చేదుగా, కోకో వాసన వచ్చే డార్క్‌ చాక్లెట్‌ గురించే ఇప్పుడు మనం చెప్పుకొంటున్నాం.

 

రోజుకో ముక్క

 

సైమన్‌ లీ అనే పరిశోధకుడు డార్క్‌ చాక్లెట్‌ ప్రభావం గురించి తెలుసుకొనేందుకు 1,139 వ్యక్తులకి వందకు పైగా సందర్భాలలో వాటిని అందించి చూశారు. తరువాత వీరి శరీరంలో వచ్చిన మార్పులను గమనించారు. ఆశ్చర్యకరంగా 200 నుంచి 600 మిల్లీగ్రాముల వరకూ డార్క్‌ చాక్లెట్‌ తిన్నవారిలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. వీరిలో ట్రైగ్లిజరైడ్స్‌ శాతం తగ్గినట్లు గమనించారు. మన రక్తంలో ఉండే ఒకరకమైన కొవ్వు పదార్థమే ఈ ట్రైగ్లిజరైడ్స్. ఇవి కనుక సాధారణ స్థాయికి మించి ఉంటే, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 

అంతేకాదు

 

డార్క్‌ చాక్లెట్‌ను తినడం వల్ల కేవలం ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే కాదు... శరీరానికి మంచి చేసే HDL కొలెస్టరాల్‌ కూడా పెరగడాన్ని నమోదు చేశారు. ఇంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయి కూడా అదుపులోకి వచ్చిందట. పైగా ఇన్సులిన్‌ పనితీరు కూడా మెరుగుపడింది. ఇక ధమనులలో వాపుని కలిగించే పరిస్థితులలో కూడా మార్పు కనిపించింది.

 

కొత్తేమీ కాదు

 

డార్క్‌ చాక్లెట్లు మితంగా తినడం ఆరోగ్యానికి మంచిదంటూ వార్తలు రావడం కొత్తేమీ కాదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందనీ, రక్తపోటు తగ్గుతుందనీ, చర్మానికి వన్నె తెస్తుందనీ, మెదడు పనితీరుని మెరుగురుస్తుదనీ.... ఇలా చాలా విషయాలే చెబుతూ వస్తున్నారు. అయితే ఈ తాజా పరిశోధనతో డార్క్‌ చాక్లెట్‌ గుండెకి కూడా మంచిదనీ, చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందనీ తేలింది. కాకపోతే ఒక్క ముక్కంటే ఒక్క ముక్క తీసుకుంటే ఈ ఉపయోగాలు ఉంటాయి. మరి మనం అంతటితో ఆగగలమా!

- నిర్జర.