స్నేక్ ప్లాంట్ మొక్క పెంచుతుంటారా? ఈ నిజాలు తెలుసా?
posted on Jan 2, 2024 9:16AM
సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా మొక్కలు పెంచుకోవడం చాలా మంది చేసే పని. కళ్లెదురుగా మొక్కలు ఎదుగుతూ పువ్వులు, కాయలు కాస్తుంటే అదొక చెప్పలేని ప్రశాంతత మనసును హాయిగా ఉంచుతుంది. చాలామంది ఇంటిముందు జాగా లేకపోయినా కుండీలలో పెరిగే అవకాశం ఉన్న చాలా మొక్కలను పెంచుతుంటారు. వీటిలో కలబంద, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, గులాబీ, పీస్ లిల్లీ మొదలైనవి పెంచుతుంటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే స్నేక్ ప్లాంట్ గురించి చాలామందికి తెలియదు. ఈ స్నేక్ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే పాములు రావనే మాట తప్పితే దీని గురించి నిజానిజాలు తెలిసినవాళ్లు తక్కువ. ఈ మొక్క గురించి నిజాలేంటంటే..
స్నేక్ ప్లాంట్ గురించి చైనా వాస్తుశాస్త్రం చాలా గొప్పగా చెప్పింది. ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అదృష్టం కలసివస్తుందని పేర్కొంది. అందుకే స్నేక్ ప్లాంట్ ను అదృష్టం తెచ్చి పెట్టే మొక్కగా చైనీయులు భావిస్తారు.
సైన్స్ ప్రకారంగా చూస్తే స్నేక్ ప్లాంట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి...
స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ప్రాంతంలో ఉండే గాలిని స్వచ్చంగా ఉంచుతుంది. గాలి శుద్ది చేయడంలో ఈ మొక్క ప్రభావవంతంగా ఉంటుంది.
స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే మొక్క. చాలా మొక్కలు పగటి సమయంలో ఆక్సిజన్ గ్రహించి కార్భన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంటాయి. కానీ స్నేక్ ప్లాంట్ మాత్రం పగటి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.
వాతావరణంలోని మలినాలను, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఇది అలెర్జీలను, అలెర్జీకి కారణమయ్యే వాతావరణాన్ని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలున్నవారు, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
స్నేక్ ప్లాంట్ పెంపకంలో అంత ఇబ్బందులేమీ ఉండవు. ఈ ఇండోర్ మొక్కకు నీరు ప్రతిరోజూ పెట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ గాలి, తక్కవ నీరు, తక్కువ వెలుతురులో చాలా ఆరోగ్యంగా పెరుగుతాయివి.
స్నేక్ ప్లాంట్ మొక్క ఇంట్లో తేమను నియంత్రించడంలో ముందుంటాయి. ఇవి పెరిగే కొద్దీ తేమను విడుదల చేస్తాయి. దీని వల్ల ఇంటిలోపల వాతావరణం చలిగానూ లేకుండా, వేడిగానూ లేకుండా సమతుల్యంగా ఉంటుంది.
ఇకపోతే స్నేక్ ప్లాంట్ ఆకులతో కూడిన మొక్క. దీని ఆకులు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. ఈ మొక్క చూడ్డానికి చాలా ఆకర్షణగా ఉంటుంది. పైపెచ్చు ఈ ఆకులు ఆకుపచ్చ రంగులో కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటాయి.
*నిశ్శబ్ద.