ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు

 

ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గమే..అదే ఎంపీ అంటే పలు నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం. అయితే పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజవర్గ ఇన్‌చార్జిలు ఓ నేతని ఎంపీగా పోటీ చేయమంటుంటే ఆయన మాత్రం నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా అంటున్నారు. ఆయనే సీఆర్‌డీఏ సభ్యుడు, కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు. నెల్లూరు లోక్ సభ పరిధిలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కవ. దీంతో అంతా ఎంపీ అభ్యర్థిగా మస్తాన్‌రావు పోటీ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రిని కోరుతున్నారన్నారు. కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని ఆయన ఖరాకండిగా చెప్పేస్తున్నారు. తాజాగా ఆయన దీనిపై మీడియాతో మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేగా ఓటమి చెందినా నియోజకవర్గం అభివృద్ధికోసం కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి కావలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు.

పోయిన చోటనే వెతుకునే మనస్తత్వం కలవాడినని గత ఎన్నికల్లో కావలిలో ఓటమి చెందినా తిరిగి కావలి అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యేగానే పోటీచేసి ఓడినచోటే విజయం సాధించి ముందుకు పోతానన్నారు. తనను అభిమానించే వేలాదిమంది ప్రజలను నిరాశ పరచదలుచుకోలేదని, తాను ఎంపీగా పోటీచేస్తానన్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని తాను కావలినుంచే పోటీలో ఉంటానని స్పష్టంచేశారు. 2009 లో టీడీపీ తరుపున కావలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మస్తాన్‌రావు..2014  లో ఓటమిపాలయ్యారు. ఈసారి అక్కడినుంచే పోటీ చేసి గెలవాలి ఆనుకుంటున్న మస్తాన్‌రావు..ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసే అవకాశం లేకపోలేదు.