తెలంగాణ తీర్పు ఎవరి వైపు?
posted on Nov 28, 2023 11:36AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 30)న జరగనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ, డిసెంబర్ 30న ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత రంగంలో 2,290 అభ్యర్థులు మిగిలారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 36,655 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఒక ఓటర్ల విషయానికి వస్తే 1,58,71,493 పురుషులు 1,58,43,339 స్త్రీలు మరియు 2,557 ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రం లోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను, 18 నియోజకవర్గాలు ఎస్సీ 9 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు ఉన్నాయి.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మొత్తం 119 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను బరిలో నిలపగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు. అలాగే విపక్ష కాంగ్రెస్ రాష్ట్రంలోని 118నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలిచారు. కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సీపీఐ ఒక స్థానం నుంచి బరిలో నిలిచింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. బీజేపీ, జనసేన కూటమి మొత్తం 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక మరో జాతీయ పార్టీ బహాజన సమాజ్ పార్టీ 106 మంది అభ్యర్థులను, సీపీఎం 19 మంది అభ్యర్థులనుఎంఐఎం 9 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఈ ఎన్నికలలో ధన ప్రవాహాన్ని, ప్రభావాన్ని నిలువరించేందుకు జరిపిన తనిఖీలు, దాడులలో ఎన్నికల సంఘం 659.20 కోట్ల నగదు జప్తు చేసింది.
2023 శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రకటించగా, బీజేపీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. బిసి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని వాగ్దానం చేసింది. మరో వైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పనితీరునే నమ్ముకుంది. మూడు ప్రధాన పార్టీలూ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సర్వేలు, అంచనాలను పక్కన పెడితే.. తెలంగాణ తీర్పు ఎవరివైపు అన్న ఉత్కంఠ మాత్రం వచ్చే నెల 3 వరకూ కొనసాగుతుంది.