అలిపిరి వద్ద బేస్ క్యాంప్!

తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, వారు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమలేశుని దర్శనం జాప్యం లేకుండా వేగంగా జరిగేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవడానికి రెడీ అయ్యింది.  ఇందు కోసం ప్రతి భక్తుడికీ ఒక పర్మనెంట్ ఐటీ ఇచ్చేందుకు సమాయత్తమౌతోంది. అలాగే తిరుమల విజన్ 2047 కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.  

అందులో భాగంగానే అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయించింది.  15 హెక్టార్ల విస్తీర్ణంలో  ఏర్పాటు చేయనున్న ఈ బేస్ క్యాంప్ వద్ద నుంచి ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నిరోధించి భక్తులకు బస్సుల్లో అవీ ఎలక్ట్రికల్ బస్సుల్లో కొండపైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. అలాగే అలిపిరి వద్దే వసతి, దర్శనం సహా అన్ని కౌంటర్లనూ ఏర్పాటు చేయనుంది.  ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించింది.  తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీ తగ్గించడం, తద్వారా కాలుష్యాన్ని అరికట్టడం లక్ష్యంగా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.