బండి సంజయ్ సభతో ఉద్రిక్తత.. బీజేపీ వర్సెస్ పోలీస్..
posted on Aug 28, 2021 2:07PM
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. అమ్మవారికి పూజలు చేసి, ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. యాత్ర ఆరంభం సందర్భంగా చార్మినార్ దగ్గర నిర్వహించిన సభలో ఉద్రిక్తత తలెత్తింది.
చార్మినార్ దగ్గర హైటెన్షన్ చోటు చేసుకుంది. బీజేపీ సభను చిత్రీకరిస్తోన్న డ్రోన్ కెమెరాను పోలీసులు అడ్డుకున్నారు. డ్రోన్ కెమెరాలకు పర్మిషన్ లేదంటూ అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. డ్రోన్ కెమెరాను తీసుకెళుతున్న పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కేడర్, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో.. బండి సంజయ్ పోలీసులకు పలుమార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులు డ్రోన్ కెమెరాను స్టేషన్‌కు తరలించడంతో బీజేపీ నాయకులు ఖాకీలతో మంతనాలు ప్రారంభించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో బీజేపీ నేత మంత్రి శ్రీనివాసులు మాట్లాడారు. చార్మినార్ పీఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీగా గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.