రాజధాని పనులు ఆపొద్దు.. ఆర్భాటాలకు పోవద్దు: ఏపీ సీఎం జగన్

 

సీఆర్డీఏ పై సీఎం జగన్మోహనరెడ్డి నిర్వహించిన సమీక్షలో రాజధాని పై క్లారిటీ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఆర్ డీఏ పరిధిలో నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయని.. ఇంకా ప్రారంభించాల్సిన నిర్మాణాల పరిస్థితేంటనే అంశంపై అధికారుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. రాజధాని పరిధిలోని నిర్మాణాలతో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు.. వాటిని అభివృద్ధి చేసే అంశాలపైన సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. క్యాపిటల్ పరిధిలో నిర్మాణాలను కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జగన్. మరో వైపు గత ప్రభుత్వం చేసిన విధంగా అనవసరపు ఆర్భాటాలకు పోవద్దని సూచించారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన డిజైన్ల రూపకల్పనలో ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రస్తుతమున్న నిర్మాణాలతో పాటు పూర్తిస్థాయిలో ప్రారంభం కాని నిర్మాణాన్ని కూడా సర్కారు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనుంది.దీంట్లో భాగంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ లు ఇవ్వడంతో పాటు వాటిని అభివృద్ధి చేయడం భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం వంటి వాటిని అమలు చేస్తామని సర్కారు స్పష్టం చేసింది. ఇక రాజధాని ముంపు బారిన పడకుండా కృష్ణానది వరద కొండవీటి వాగు, పాలవాగు వరదప్రవాహం పరిస్థితి పైన దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.