బాబు మార్క్ కనిపిస్తోంది.. సుపరిపాలన పరుగులు పెడుతోంది!

సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో  సుపరిపాల‌న ప‌రుగులు పెడుతోంది. సీఎంగా బాబు ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటినుంచి నిత్యం అధికారుల‌తో స‌మీక్షలు నిర్వ‌హిస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సైతం త‌మ‌త‌మ శాఖ‌ల్లోని అధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రుపుతూ శాఖాప‌రంగా చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే  వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించిన ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పైనా వేటు ప‌డింది. మొత్తానికి గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఎప్పుడూలేని విధంగా ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలోనే చంద్ర‌బాబు, మంత్రులు ఏపీలో పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, తాజాగా తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది.  జులై 1వ తేదీనే రాష్ట్రంలోని అర్హులంద‌రికీ పింఛ‌న్లు అందించేందుకు సిద్ధ‌మైంది. 

వైసీపీ  హ‌యాంలో వాలంటీర్ల ద్వారా ప్ర‌తీనెలా అర్హుల‌కు ఇంటింటికి పింఛ‌న్లు అందించింది. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార  స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌లు ఇదే అంశాన్ని ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీనెలా ఇంటింటికి పింఛ‌న్ రాద‌ని, మీ పింఛ‌న్లు తీసేస్తార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసేస్తుంద‌ని, వారు లేకుంటే మీ ఇంటికి నేరుగా పింఛ‌న్లు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు రావ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. కానీ, చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు  తెలుగుదేశం కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు తొలుత జూలై 1న పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంపై దృష్టిసారించారు. జూలై 1వ తేదీన అర్హులైన ప్ర‌తీ పింఛ‌న్ దారుడికి ఇంటింటికి వెళ్లి న‌గ‌దు అందించాల‌ని అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  

వైసీపీ హ‌యాంలో అర్హుల‌కు రూ. 3వేలు పింఛ‌న్ అందించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకివ‌స్తే పింఛ‌న్ రూ. 4వేలు అందిస్తామ‌ని, అదికూడా ఏప్రిల్ నెల‌నుంచి అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు నాయుడు హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇచ్చిన హామీ మేర‌కు.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెల‌ల‌కు సంబంధించి  తాను పెంచుతానన్న  వెయ్యి ప్లస్ ఇప్పటికే అమలులో ఉన్న రూ. 3వేలు కలిపి  జులై ఒకటిని పింఛనుదార్లందరికీ రూ. 7 వేలు చొప్పున పింఛ‌న్ అంద‌నుంది. పెంచిన పింఛ‌న్లతో క‌లిపి రూ.4,399.89 కోట్లను 65లక్షల 18వేల 496 మంది లబ్దిదారులకు ఒక్క రోజులోనే పంపిణీ చేయ‌నున్నారు. పింఛ‌న్ల పంపిణీ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయించారు. జూలై 1న ఉదయం 6 గంటలకు పింఛ‌న్ల‌ పంపిణీ ప్రారంభ‌మై.. సాయంత్రం వ‌ర‌కు పూర్త‌య్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 29వ తేదీ శనివారం రోజే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పింఛన్ల పంపిణీకి సిద్ధం కావాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

పింఛ‌న్లు పెంపు వ‌ల్ల ప్ర‌తినెలా రాష్ట్ర ప్ర‌భుత్వంపై అద‌నంగా రూ. 819 కోట్ల మేర భారం ప‌డుతుంది. ప్ర‌స్తుతం చెల్లించాల్సిన బ‌కాయిల భారం రూ. 1650 కోట్లు.  వైసీపీ హ‌యాంలో పింఛ‌న్ల కోసం ఏడాదికి రూ. 22,273.44 కోట్లు  ఖ‌ర్చు కాగా.. కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో జూలై నెల‌లో 33,099.72 కోట్లు వ్య‌యం అవుతుంది. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచే ప్ర‌తీనెలా ఇంటింటికీ పింఛ‌న్ అందిస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేర‌కు జూలై 1న అర్హులైన ప్ర‌తీఒక్క‌రికి పింఛ‌న్ సొమ్ము అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌నితీరుప‌ట్ల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.