హమ్మయ్య బయటకొచ్చారు!

23 రోజులు.. ఇల్లూ వాకిలీ వదిలేసి.. పెళ్లాం బిడ్డలను కూడా చూడకుండా, కనీసం ఫోన్ లోకి కూడా అందుబాటులోకి రాకుండా ప్రగతి భవన్ కే పరిమితమైన ఫామ్ హౌస్ ట్రాప్ ఎమ్మెల్యేలు నలుగురూ శనివారం (నవంబర్ 19)బయటకు వచ్చారు. తాము ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తున్నామని ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా శుక్రవారం (నవంబర్ 18) ప్రకటించారు.

 బీజేపీ తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని, ఇందుకోసం ముగ్గురు వ్యక్తులు మధ్యవర్తులుగా వచ్చారంటూ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ ఫాంహౌస్ లో పోలీసులు  ఆ మధ్యవర్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  కాగా, అదే రోజు ఫాంహౌస్‌ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు అప్పటి నుంచీ గత 23 రోజులుగా  అక్కడే ఉంటున్నారు. మధ్యలో ఒకసారి  అవును ఒకే ఒక్క సారి మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు హాజరయ్యారు.

అయితే వారంతట వారుగా ఆ సభకు వెళ్లలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వారిని తనతో తీసుకెళ్లి.. అక్కడి ప్రజలకు వారి మోహం చూపించి  మళ్లీ తనతో పాటే తీసుకువచ్చేశారు. ఇన్ని రోజులుగా వారు  ప్రగతిభవన్‌లోనే ఉంటుండడంపై   విమర్శలు వెల్లువెత్తుతుంటే మరో వైపు వారు  ఇ వారి నియోజకవర్గాల్లో  పోలీసులకు ఫిర్యాదులు సైతం అందాయి.

అయితే ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ తాము రక్షణ కోసమే ప్రగతి భవన్ లో తలదాచుకున్నారని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇక వారు బయటకు రావడానికి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నారనడం కంటే కేసీఆర్ వారికి అనుమతి ఇచ్చారని చెప్పడం సబబుగా ఉంటుంది. ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తామని వారీ సందర్భంగా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై విలేకరుల ప్రశ్నలకు వారు సమాధాానం చెప్పడానికి నిరాకరించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము దానిపై మాట్లాడబోమని స్పష్టం చేశారు.

పైలట్ రోహిత్ రెడ్డి అయితే ఈ రోజు అయ్యప్పమాల ధరించనున్నారు. ఎమ్మెల్యేల కోనుగోలు బేరసారాల వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో... ఆ వ్యవహారంలో ఇన్ వాల్వ్ అయి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలూ అప్పటి నుంచీ ప్రగతి భవన్ లోనే బస చేయడం అంతకు మించి విమర్శలకు, అనుమానాలకూ తావిచ్చింది.  ఎమ్మెల్యేలు కనిపించడ లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. ప్రగతి భవన్ లో వారు బందీలు గా ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అక్కడి నుంచి వారికి విముక్తి కలిగించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వారు బయటకు వచ్చారు. అయినంత మాత్రాన ఈ వివాదం సద్దుమణిగినట్లు కాదు. ఏకంగా 23 రోజుల పాటు ఇల్లూ వాకిలీ వదిలేసి, పెళ్లాం బిడ్డలకు మొహం చూపకుండా, నియోజకవర్గం గురించి పట్టించుకోకుండా, కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకుండా ప్రగతి భవన్ లో వారేం చేశారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు కాకుంటే తరువాతైనా ఈ ప్రశ్నలకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.