మహారాజశ్రీ మిరపకాయ... శ్రీశ్రీశ్రీ యాపిల్!
posted on Apr 17, 2020 9:30AM
‘మిరపకాయ’ చూడటానికి చిన్నదే అయినా మన వంటల్లో దాని స్థానం మాత్రం పెద్దదే. కారం లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. కేవలం రుచికి మాత్రమే కాదు... ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయట. మిరపకాయలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు పొటాషియం, మాంగనీసు, ఫోలేట్ వంటి పోషకాలు బాగా లభిస్తాయట.
మన ఆరోగ్యానికి మేలు చేసే కాప్సాసిన్ అనే పదార్ధం పచ్చిమిర్చిలో మనకు దొరుకుతుంది. శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడి ఆరోగ్యం చేకూర్చే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పచ్చిమిరపకాయలో ఉన్నాయట.
తొక్కే కదా అని తీసిపారేయకండి...
ఇక మిరపకాయలలోని విటమిన్ బి శరీరంలో హోమోసిస్టిన్ పరిమాణాన్ని తగ్గించడమే కాదు.. హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందిట. సరే మరి, ఘాటైన మిరపకాయలోనే ఇన్ని సుగుణాలు వుంటే తియ్యటి యాపిల్ పండులో ఎన్ని ఉండాలి? రోజుకో యాపిల్ తింటే ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవు అంటారు కదా.
చివరికి రోజుకో యాపిల్ తింటే క్యాన్సర్ కూడా దరిచేరదుట. యాపిల్ పండు తొక్కలో వుండే దాదాపు పన్నెండు రకాల రసాయన పదార్ధాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌లో తేలింది.
‘ట్రిటర్ పెనాయిడ్స్’గా వ్యవహరించే ఈ పదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయిట. కేవలం క్యాన్సర్ కణాలను అడ్డుకోవడమే కాదు.. ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటకి పంపించడంలోనూ యాపిల్ పై తొక్కులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు పరిశోధకులు. తొక్కులోనే కాదు..
యాపిల్ పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ, ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్ తింటే క్యాన్సర్‌కి చెక్ చెప్పవచ్చని వీరు సూచిస్తున్నారు. సో.. రోజుకో యాపిల్ తినడం అలవాటుగా మార్చుకోవాలి.
హాయిగా ఊపిరి తీయండిలా...
మన శరీరం మొత్తానికి రోజంతా ప్రాణవాయువు సరఫరా అవ్వాలంటే ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేయాల్సిందే. ఈ ఊపిరితిత్తులు బలహీనమైతే జలుబు, దగ్గు వంటివి తరచూ పట్టి పీడిస్తుంటాయి. వీటి బారిన పడకుండా వుండాలంటే వారానికి కనీసం 5 యాపిల్స్ తినడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే వెల్లుల్లిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయిట. అలాగే ఉల్లిపాయలో వుండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, గ్రీన్ టీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది అని తేలింది పరిశోధనల్లో.
మోకాళ్ళ నొప్పులు హుష్ కాకి...
మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడేవారు రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అలాగే నువ్వులని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ములగాకుని సాధారణంగా చాలామంది వంటకాలలో వాడరుగానీ, మునగాకుని వీలైనంత ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ళ నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుందట. ఇవండీ.. చక్కటి ఆరోగ్యానికి కొన్ని మంచి సూత్రాలు.. మరి పాటిస్తారు కదూ!