తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
posted on Jun 7, 2016 6:22PM
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్లే వర్షాలు పడుతున్నాయని, తాజా వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 72 గంటల్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వడగళ్లతో వాన పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.