అప్పు కోసం గవర్నర్ అధికారాలు తనఖా? జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల చేత అక్షింతలు వేయించుకోవడం అలవాటుగా మారిపోయింది. కోర్టులు పెట్టవలసిన నాలుగు చీవాట్లు పెట్టనిదే, ప్రభుత్వ పెద్దలకు నిద్రపట్టదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసో లేదో కానీ, ఆయన దాన్నసలు పట్టించుకోరు. అధికారులు, లక్షల లక్షల్లో జీతాలు, కోటల్లో ముడుపులు పుచ్చుకుంటున్న సలహ దారులు చాలామందే ఆయన చుట్టూ ఉంటారు. అయినా, ఎవరి లెక్క వారిది. ఎవరి పనిలో వారు బిజీ ..బిజీగా  ఉంటారు. అందుకే ప్రభుత్వం ఏమి చేయచ్చు, ఏమి చేయకూడదు, అనే విషయంలో ఎవరికీ ఎలాంటి పట్టింపు ఉండదు, అందుకే ప్రతి చిన్నా చితక విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం, సర్కార్ నెత్తిన అక్షింతలు వేయడం నిత్య క్రతువుగా మారింది. 

అప్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఎద్దగోలుగా వ్యవ్వహరిస్తుందో వేరే చెప్పనక్కర లేదు. అప్పుకోసం ఏమైనా చేస్తాం.. ఎంతవరకైనా పోతాం అనే విధంగా ప్రభుత్వం మద్యంపై ముందున్న పాతికేళ్ళ పాటు వచ్చే ఆదాయాన్ని, ముందుగానే తాకట్టు పెట్టి రూ. 25వేల కోట్లు ప్పుతెచ్చింది. ఈ ఒక్క పద్దును పట్టి చూస్తే చాలు, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పు సూత్రం అర్థమైపోతుంది.  అయితే అదొక్కటేనా అంటే, కాదు, ఏపీ సర్కార్ బుర్రలో, ‘వాట్ యాన్ ఐడియా..జగన్’  అని అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఇన్నోవేటివ్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. అందుకు మద్యం అప్పు ఓ మచ్చుతునక అయితే, ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును చేర్చిన ఐడియా ఇంకొకటి. ఇప్పుడు  ఈ విషయంగానే, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు శ్రీ సర్కార్ వారికి చీవాట్లు పెట్టింది. 

వివరాలలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు... బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు ఎలా చేరుస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని  తొలగించడం సరికాదని పేర్కొంది.

ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీ ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది. నిధుల బదిలీకి సంబంధించి ఒరిజనల్‌ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏపీఎ్‌సడీసీ ఏర్పాటు, అప్పులు తీసుకునే విధానంపై, ఇతర నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వై.బాలాజీ, బి.నళినీకుమార్‌, గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ‘‘ఎవరైనా వ్యక్తి, సంస్థ గవర్నర్‌పై కేసులు నమోదు చేయకుండా రాజ్యాంగంలోని అధికరణ 361 రక్షణ కల్పిస్తుంది. కానీ ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని ప్రభుత్వం వదులుకుంది. రుణాలు తిరిగి చెల్లించని పక్షంలో ఆర్థిక సంస్థలు గవర్నర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశముంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీకి తనఖా పెట్టారు. ఒప్పందంలో గవర్నర్‌ పేరును చేర్చడంపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

జూలై 30వ తేదీన రాష్ట్రానికి రాసిన లేఖలో... రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా అప్పు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణకు వ్యతిరేకమని కేంద్రం తెలిపిందన్నారు. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సమాధానమిస్తూ...‘‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీకి జమ చేస్తున్నామన్న వాదనలో నిజం లేదు’’ అని తెలిపారు. ఎస్‌డీసీ ద్వారా రూ.25,000 కోట్ల భారీ మొత్తాన్ని అప్పుగా తేవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమే లేఖ రాసినందున కేంద్రం, అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంటర్‌ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్‌  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది. నిజానికి అప్పిచ్చేవాడు ఎవరైనా, ఏషరతులు విధించనా తలవంచుకుని తెసుకోవదానికి, చివరకు గవర్నర్ సార్వభౌమాధికారాన్ని కుదువ పెట్టేదుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది.. అంటే .. ఇక మిగిలిదేముంది ?