అయ్యో పాపం... జూపూడి...

 

ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్‌ని టీడీపీ ద్వారా పొందిన దళిత నాయకుడు జూపూడి ప్రభాకరరావుకు అదృష్టం ముఖం చాటేసింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఎమ్మెల్సీ కావడానికి సాంకేతికంగా సమస్య ఏర్పడింది. దాంతో ఆయన స్థానంలో మాజీ స్పీకర్ కె.ప్రతిభా భారతికి ఆ అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. చివరి క్షణాల్లో జరిగిన ఈ పరిణామం అందరూ జూపూడి మీద జాలిపడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకరరావుకు హైదరాబాద్‌లోని కూకట్ పల్లి అసెంబ్లీ స్థానంలో ఓటు హక్కు వుంది. అలా ఆయనకు ఎమ్మెల్సీ మిస్సయింది. అయితే ప్రతిభా భారతి పేరు విషయంలో కూడా కొన్ని అనుమానాలు వున్నాయి. తెలుగుదేశంలోని సీనియర్లు కుతూహలమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్.... వీరందరూ ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. చివరి క్షణం వరకు అభ్యర్థి ఎవరో తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.