నిమ్మగడ్డపై మంత్రుల సభా హక్కుల నోటీస్
posted on Jan 30, 2021 2:30PM
ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీ పోరులో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పార్టీల మధ్య సమరం కంటే ఏపీ సర్కార్, ఎస్ఈసీ మధ్య పోరాటమే ఇప్పుడు హీటెక్కిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనా.. వార్ ఇంకా ముదురుతోంది. తాజాగా ఎన్నికల కమిషనర్‌పై ఏపీ ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్‌లో సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ఆ చర్చ జరుగుతోంది.
మరోవైపు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. శనివారం సీఎం జగన్ సొంత గడ్డ కడప జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్ లో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అసాధారణ ఏకగ్రీవాల ప్రక్రియ సరికాదన్నారు నిమ్మగడ్డ. ఇలాంటి ప్రక్రియపై దృష్టి పెడతాయని, బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్‌లతో నిఘా ఉంటుందని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో 2006లో 36 శాతమే ఏకగ్రీవమయ్యాయని చెప్పారు నిమ్మగడ్డ. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. ఏ పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తేలేదని తాను స్పష్టం చేశానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయంలో ఎన్నికలను నిర్వహించడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.