కేసీఆర్.. అబద్ధాలు మానుకో...
posted on Oct 25, 2014 11:16AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధపు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న పదజాలం తెలుగు ప్రజలు సిగ్గుతో తల దించుకునేలా వుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుంటే, కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. మూడు ప్రాంతాల రైతుల సంక్షేమం కోసమే గతంలో చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజ్ మీద మహా ధర్నా చేశారని దేవినేని గుర్తు చేశారు. ఇది అసత్యమని నిరూపిస్తే తాను తన ముక్కు నేలకి రాస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభంలోకి నెట్టారని ఆయన విమర్శించారు. సెంటిమెంట్‌తో ప్రజలను మభ్యపెట్టడం మంచి పద్ధతి కాదని, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేయాలని దేవినేని సూచించారు.