కృష్ణపట్నంపై హక్కా? అయితే హైదరాబాద్‌లో వాటా ఇవ్వండి..
posted on Oct 25, 2014 12:03PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం మీద తమకు హక్కు వుందన్న వాదనను వినిపించిన నేపథ్యంలో తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిస్పందించారు. కృష్ణపట్నంపై తెలంగాణకు హక్కుందని అంటున్న కేసీఆర్ హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్‌కి హక్కు ఇస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో దశాబ్దాలపాటు శ్రమించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ఏదైనా మాట్లాడేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మీద నిందలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల సెంటిమెంట్‌తో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి దగా చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.