ఆరు రోజులు దాచెయ్​.. ఆదివారం వేసెయ్​! జగన్ సర్కార్ వ్యాక్సిన్ పాలసీ అదుర్స్... 

కొవిడ్ కట్టడి ఏకైక అయుధం వ్యాక్సినేషన్. అందుకే దేశ వ్యాప్తంగా ప్రస్తుతం టీకాల పంపిణి వేగంగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నంతవరకు అన్ని రాష్ట్రాలు వేగంగా తమ ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే వ్యాక్సినేషన్ లో ఏపీ సర్కార్ తీరు మాత్రం తీవ్ర విమర్శల పాలవుతోంది. రికార్డుల కోసం అరాటమే తప్పు నిజమైన చిత్తశుద్ది లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గత అదివారం ఒక్క రోజే పదమూడున్నర లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది ఏపీ సర్కార్. దేశంలో ఇప్పటివరకు ఇదే రికార్డ్ అని ప్రకటించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత జరిగిన వ్యాక్సిన్ లెక్కలు చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. 

ఆదివారం 13.5 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిన ఏపీ సర్కార్ ... తర్వాత రోజైన సోమవారం మాత్రం కేవలం 46 వేల టీకాలు వేసింది. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. ఆదివారం రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ వేసిన వాళ్లు.. సోమవారం అందులో కనీసం ఐదు శాతం కూడా ఎందుకు వేయలేదన్నదే ప్రశ్న. నిజానికి సోమవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భారీగా వ్యాక్సినేషన్ చేపట్టారు. సోమవారం ఒక్కరోజే 80 లక్షల మందికి టీకాలు వేశారు. కాని ఏపీలో మాత్రం కేవలం 46 వేలే. రికార్డులంటూ పబ్లిసిటి చేసుకోవడం కోసం మిగితా రోజుల్లో టీకాలు వేయకుండా.. ఒక్కరోజే డ్రైవ్ పేరుతో హడావుడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరు రోజులు దాచెయ్..ఆదివారం వేసెయ్ అన్నట్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వం తీరు ఉందని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ అవలంభిస్తున్న విధానాల వల్ల ముందు ముందు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. జూన్ 20న టీకా తీసుకున్న పదమూడున్నర లక్షల మందిలో కోవిషీల్డ్ తీసుకున్న వారికి 12 వారాల తర్వాత.. కొవాగ్జిన్ తీసుకున్న వారికి 4 నుంచి 6 వారాల్లో సెకండ్ డోస్ వేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ ఇదేరకమైన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమవుతుందో లేదో చెప్పలేం. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండాలి. అంతా సాఫీగా జరిగితే సమస్య లేదు. కాని మెగా డ్రైవ్ చేపట్టకపోతే.. సెకండ్ డోస్ కోసం అంతా ఎగబడే పరిస్థితి ఉంటుంది. ఇదో మరో సమస్యకు కారణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకుంటూ పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపుగా లక్ష వరకు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. తమ దగ్గర టీకాలు ఎక్కువగానే అందుబాటులో ఉన్నా... తెలంగాణ అధికారులు మాత్రం హడావుడి చేయకుండా రోటీన్ గా వెళుతున్నారు. అలా చేయడం వల్ల సెకండ్ డోస్ సమయంలో ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ అదికారుల మాట. జూన్ లోకోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెప్టెంబర్ లో సెకండ్ డోసు వేయాల్సి ఉంటుంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారంలో ఆ సమయంలో దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు. అదే జరిగితే సెకండ్ డోస్ వ్యాక్సిన్ పంపిణికి ఆటంకం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవేమి పరిశీలించకుండానే, భవిష్యత్ వ్యూహం అంటూ లేకుండానే ప్రచారం కోసం ఏపీ సర్కార్ ప్రమాదకరమైన పరిస్థితులను స్పష్టిస్తుందనే విమర్శలు వైద్య వర్గాల నుంచి వస్తోంది. 

మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. సోమవారం రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసి.. మరుసటి రోజే భారీగా పడిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముందు వ్యాక్సిన్లన్నింటినీ దాచేసి.. ఆ తర్వాత వేసి.. మళ్లీ మామూలుగా ఇబ్బందులు పడడమే రికార్డు వెనక ఉన్న అసలు రహస్యమని ఎద్దేవా చేశారు.

‘‘ఆదివారం దాచెయ్.. సోమవారం వేసెయ్.. మంగళవారం చేతులెత్తేయ్’’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇదే ఒక్కరోజులో ఎక్కువ మందికి టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించడం వెనక అసలు రహస్యమని అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ఈ ఫీట్ కు చోటు దక్కక తప్పదంటూ సెటైర్ విసిరారు. ‘‘మోదీ ప్రభుత్వానికి మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. ఎవరికి తెలుసు!’’ అని మరో కామెంట్ చేశారు. ‘మోదీ ఉంటే ప్రతిదీ సంభవమే’ అన్న దానిని ‘మోదీ ఉన్న చోట అద్భుతాలే’గా మార్చుకోవాలన్నారు.