మరో బీహార్ లా ఏపీ.. జగన్ సారూ! దిశ చట్టం ఏక్కడుంది?

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఘటనలు రాష్ట్రంలో అరాచకం తాండవిస్తున్నదా అనిపించేలా ఉన్నాయి. ఇసుక మాఫియాల ఆగడాలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలూ రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయాయి. నిన్న ఒక్క రోజే రెండు చోట్ల ఇసుక మాఫియాలు వీరంగం సృష్టిస్తే.. రెండు  వేర్వేరు సంఘటనల్లో మహిళలపై అత్యాచారం, అఘాయిత్యం జరిగింది. ఏ ఒక్క సంఘటన విషయంలోనూ ప్రభుత్వం కానీ , పోలీసులు కానీ సరైన రీతిలో స్పందించలేదు. అధికారం, మాఫియాలు కలగలిసిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితే ఉదాహరణగా చెప్పవచ్చు.  ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లా మారిపోతున్నదనడానికి రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులే తార్కానం. 
విపక్ష నేతలు చిన్న నిరసన కార్యక్రమం చేపడితేనే అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతున్న పోలీసులు...ఏకంగా ప్రభుత్వాధికారిపై దాడి జరిగితే... కేసులు పెట్టకుండా దర్యాప్తు పేరుతో మీన మేషాలు లెక్కిస్తున్నారు. మహిళల రక్షణకు దిశ చట్టాన్నితీసుకు వచ్చామని ఘనంగా చెప్పుకుంటున్నసర్కార్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా బాధ్యులను శిక్షించడంలో విఫలమౌతున్నది. 
ప్రభుత్వ నిష్క్రియాపరత్వమే దన్నుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటి పోయాయి.  ఒకప్పుడు అరాచకత్వానికి నమూనాగా దేశంలో బీహార్ ను ఉదహరించేవారు. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించేసిందని అంటున్నారు. 

ఇసుక మాఫియా వెనుక ఉన్నది అధికార పార్టీ నాయకులే కావడంతో చర్యలు తీసుకోవడం లేదన్నఆరోపణలు ఉన్నాయి. అస్మదీయుల ఆగడాలకు, అరాచకాలకు జగన్ సర్కార్ కొమ్ముకాస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నాడు కృష్ణాజిల్లా గుడివాడ, శ్రీకాకుళం జిల్లాలలో ఇసుక మాఫియా వీరంగం సృష్టించింది. ఆ సంఘటనల్లో ఇసుక మాఫియా గూండాలు ఏకంగా అధికారులపైనే దాడులకు దిగారు. గుడివాడలో ఆర్ఐపై జేసీబీతో దాడి చేసి హత్యా యత్నం చేశారు. ఈ రెండు సంఘటనల్లోనూ కూడా మాఫియా గూండాలు అధికార పార్టీ నేతల అనుచరులేనన్న ఆరోపణలు ఉన్నాయి. 
ఇక విజయవాడలో మానసిక వికలాంగురాలిని నిర్బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఫిర్యాదుపై సకాలంలో స్పందించకపోవడం, చివరికి బాధితురాలి బంధువులే నిందితుడిని పట్టుకుని అప్పగించినా కేసులు నమోదు చేయడంలో తాత్సారం చేయడం చూస్తుంటే రాష్ట్రంలో అరాచకపాలన పరాకాష్టకు చేరిందని అవగతమౌతుంది. 
రాష్ట్రంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత అంటూ  దిశ చట్టాన్ని తీసుకు వచ్చిన జగన్ సర్కార్...ఆర్భాటంగా దిశ పోలీసు స్టేషన్లను సైతం ఏర్పాటు చేసింది. విజయవాడలో ఆ దిశ పోలీసు స్టేషన్ కు కూత వేటు దూరంలోనే...ఒక ప్రభుత్వాసుపత్రిలోని చిన్న ఇరుకు గదిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు రోజుల పాటు ఆమెను ఆసుపత్రిలోనే గదిలో నిర్భందించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రలు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సకాలంలో స్పందించలేదు. ఇప్పుడు కాదు సాయంత్రం రండి అంటూ స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. ఆఖరికి ఆమ్మాయి కనిపించకుండా  పోవడానికి ముందు ఈ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటూ పోలీసులకు ఆధారాలు అందజేసినా వారు సరిగా స్పందించ లేదు. బాధితురాలి బంధువులే ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఆసుపత్రిలో తమ బిడ్డను కనుగొని అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులకు అప్పగించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎంత ఘనంగా పని చేస్తున్నారో ఈ ఘటనలే తెలియజేస్తున్నాయి. మరో ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. స్థానిక వైసీపీ నాయకుడు భూ తగాదా పరిష్కారం కోసం ఏకంగా ఒక మహిళ మెడపై కాలు వేసి తొక్కి హత్య చేయడానికి ప్రయత్నించాడు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో జేసీబీతో పనులు చేయిస్తున్న చల్ల మహేష్ అనే వ్యక్తిని సుభద్రమ్మ అనే మహిళ అడ్డుకుంది. అదే ఆమె చేసిన పెద్ద నేరం అయిపోయింది. ఇంకేముంది ఆమెను కిందపడేలో తోసి కాలిని పీకపై తొక్కి హత్యాయత్నం చేశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలన్నీ జగన్ సర్కార్ ఏలుబడిలో నిర్వీర్యమైపోయాయని పాలనా రంగంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. అధికారులు సైతం ఏం చేయాలన్నా అధికార పార్టీ నేతల అనుమతి కోసం చూడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఆ కారణంగానే నేర సామ్రాజ్యం రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా పెత్తనం చెలాయిస్తున్నది. పేరుకే చట్టాలు కానీ అయిన వారికి చుట్టాలు అన్నట్లుగా రాష్ట్రం తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.