కూల్చొద్దు మొర్రో అన్న వైసీపీ.. రేపు చూద్దామన్న హైకోర్టు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా  నిర్మించిన, నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చేయబోతోందని జగన్ పార్టీ భయపడుతోంది. తమ కార్యాలయాలను గవర్నమెంట్ కూల్చేయబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందని వైసీపీ నాయకులు మొత్తుకున్నారు. అయితే తాను ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానంటూ ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం సదరు కట్టడాలను ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. పార్టీ కార్యాలయాలను అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. దీంతో కేసు విచారణ గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అప్పటివరకు పార్టీ కార్యాలయాలపై యదాతథ స్థితిని పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.