జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ సర్కార్ కొంప ముంచుతుందా!!

గత కొద్ది రోజులుగా జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ కాల్ ఆడియో ఎపి రాజకీయాలలో సంచలనం గా మారింది. హైకోర్టును కంటైన్ మెంట్ జోన్ గా మార్చాలని అంతే కాకుండా రిజిస్ట్రార్ జనరల్ మరణానికి చీఫ్ జస్టిస్ మహేశ్వరి కారణమంటూ వేసిన పిటిషన్ల కేసులో జడ్జ్ రామకృష్ణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ తీసుకున్న హైకోర్టు ఈ మొత్తం అంశం వెనక ఉన్న కుట్రను చేధించాలంటూ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్వీ రవీంద్రన్ ను విచారణాధికారిగా నియనిస్తూ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్యతోపాటు.. ఆయన వెనక ఉన్నవారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి.

 

చిత్తూర్ జిల్లాలో జడ్జ్ రామకృష్ణపై దాడులు జరగడం.. దాని వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించడం తెలిసిందే. దీంతో జస్టిస్ ఈశ్వరయ్య రామకృష్ణకు ఫోన్ చేసి ఆ వ్యవహారం సెటిల్ చేస్తానని చెపుతూ మరి కొన్ని విషయాల పై కూడా కామెంట్స్ చేసి ఇరుకున పడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తాను చీఫ్ జస్టిస్ పై కేసులు పెట్టించినట్లు స్వయంగా ఈశ్వరయ్యే ఆ ఫోన్ సంభాషణలో చెప్పడం అంతే కాకుండా తరువాత జరిగిన మీడియా సమావేశంలో ఆ ఫోన్ లో మాట్లాడింది తానేనని ఆయన ఒప్పుకోవడంతో.. జడ్జ్ రామకృష్ణ అవన్నీ హైకోర్టు ముందు పెట్టారు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

 

ఇప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణలో అసలు సంగతులన్నీ బయటికొస్తే.. బహుశా అది రాజకీయంగా పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. ఈ మొత్తం కుట్రలో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా జడ్జ్ రామకృష్ణ ఆరోపించినట్లుగా మొద్దు శీను హత్య కేసు కూడా టాంపరింగ్ జరిగిందనే దానిపై కూడా విచారణకు ఆదేశిస్తే.. అది మరో సంచలనం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారం ఇక్కడితో ఆగకుండా దీని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రభుత్వంలోని పెద్దలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఇరకాటం లో పడే అవకాశం కనిపిస్తోంది.