మూడు రాజధానులపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశమని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు శాసన ప్రక్రియలో ఉందన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని గవర్నర్ పేర్కొన్నారు.

కాగా, మూడు రాజధానుల అంశంలో జగన్ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న జగన్ సర్కారు.. మండలిలో మాత్రం నెగ్గించుకోలేక పోయిందన్న సంగతి తెలిసిందే. అయితే, మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.