అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం..
posted on Jun 11, 2016 10:27AM

ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 27 నాటికి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతికి రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఉద్యోగులకు అద్దెలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంగా.. వారికి హెచ్ఆర్ఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇంకా ఏపీ స్థానికతకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు.
దీంతో అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ఈరోజు నుండే ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు బదిలీలు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులంతా ఏపీకి తరలాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదేళ్లు ఒకేచోట పని చేసినవారంతా కదలాల్సిందేనని పేర్కొంది. అయితే, బదిలీకి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించింది. అయితే వ్యవసాయశాఖ ఉద్యోగులకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రుతుపవనాలు వచ్చేయడంతో వ్యవసాయ శాఖలో బదిలీలు ఉండవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.