రాజ్ భవన్‌కు చేరిన ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీల వివాదం


 

ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీ పంచాయితీ రాజ్ భవన్ కు చేరింది. కమిటీల ఏర్పాటులో అసెంబ్లీ సెక్రెటరీ తీరుపై గవర్నర్ కు  మండలి ఛైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆరంభం నుంచి వివాదాలతో కొనసాగుతున్న సెలెక్ట్ కమిటీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ అంశం గవర్నర్ వరకు చేరింది. తన ఆదేశాలను అసెంబ్లీ సెక్రటరీ అమలు చేయడం లేదంటూ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు మండలి చైర్మన్. గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ ను కలిసిన మండలి చైర్మన్ షరీఫ్ మండలిలో జరిగిన పరిణామాల్ని వివరించారు. నాలుగు పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. నిబంధనల ప్రకారమే సెలక్ట్ కమిటీ ఏర్పాటైందని, సెక్రెటరీ రెండుసార్లు ఫైల్ తిప్పి పంపారని గవర్నర్ దృష్టికి తెచ్చారు.

గతంలో ఛైర్మన్ ఆదేశాల్ని కాదన్న సందర్భం ఒక్కటి కూడా లేదని గవర్నర్ కు గుర్తు చేశారు మండలి చైర్మన్ షరీఫ్. చైర్మన్ గా తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేశానని నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న వాదనలో నిజం లేదని చైర్మన్ గవర్నర్ కు వివరించారు. మండలి రద్దు తీర్మానానికి దారి తీసిన పరిణామాలతో పాటు మండలిలో అధికార పక్షం వైఖరి గురించి కూడా చైర్మన్ గవర్నర్ కు వివరించారని సమాచారం. రాజధాని వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ బిల్లు రద్దు అంశాలపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ జనవరి ఇరవై రెండవ (జనవరి 22) తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఆ తరవాత సెలక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలంటూ పార్టీలను ఆదేశించారు. వైసిపి మినహా మిగిలిన పార్టీలన్నీ కమిటీలకు తమ పేర్లను అందజేశాయి. దీంతో ఆ పేర్లతోనే సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటెన్ జారీ చెయ్యాలని కార్యదర్శిని మండలి చైర్మన్ ఆదేశించారు. అయితే సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అధికారం తనకు లేదన్నారు అసెంబ్లీ సెక్రెటరీ. ఇందుకు సెక్షన్ 154 ను తెరపైకి తీసుకొచ్చారు.

దీని ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కార్యదర్శి ఆ ఫైల్ ను మండలి చైర్మన్ కు తిప్పి పంపారు. దీనిపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై బులిటెన్ జారీ చేయాలంటూ రెండవసారి సెక్రటరీని ఆదేశించారు. దీన్ని కూడా అసెంబ్లీ కార్యదర్శి తిప్పి పంపారు, దీంతో సెక్రెటరీ తీరును గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ గవర్నర్ కు వివరించారు. మరోవైపు కార్యదర్శి తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ సెక్రెటరీ సభా హక్కుల ఉల్లంఘనపై న్యాయపరమైన పోరాటం చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ అంశంపై వైసీపీ మరో వాదన తెరపైకి తీసుకొచ్చింది, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి పద్నాలుగు రోజులు దాటడంతో ఇక సెలక్ట్ కమిటీ ప్రస్తావనే ఉండదని చెబుతోంది. బిల్లులు కూడా ఆమోదం పొందినట్టేనని అంటోంది, మరిప్పుడు ఈ వివాదం కాస్త గవర్నర్ దగ్గరికి వెళ్లడంతో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.