ఎపిలో ఇవ్వాళ పెన్షన్లు లేనట్టే 

పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది.ఈ నేపథ్యంలో మే 1న పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఖాతాలు లేనివాళ్లకు సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. అయితే మే 1 (ఈరోజు) కార్మికుల దినం. ఈరోజు బ్యాంకులకు సెలవు. ఈ క్రమంలో... ప్రతి ఏడాది మాదిరే మేడే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్ధిదారులు గమనించాలని... దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో, ఈరోజు పెన్షన్ల పంపిణీ లేనట్టే. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల వేళ వృద్దులు, వింతువులు, వికలాంగులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందజేసే పెన్షన్లపై ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నేప‌థ్యంలో ‘సెర్ప్’ అధికారులు కీల‌క నిర్ణణయం తీసుకున్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసే బదులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాల‌ని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఒక రకంగా ఇది అధికార పార్టీకి ఈసీ కండీషన్ పెట్టినట్లుగా ఉన్నప్పటికి..పెన్షన్ దారులకు మాత్రం ఒకింత ఇబ్బందిని కలిగించే నిర్ణయమని లబ్దిదారుల్లో ఉన్న వృద్దులు అసహం వ్యక్తం చేస్తున్నారు.