రెండో విడతలోనూ బీజేపీకి మైనస్సే?

మూడో సారి అధికారం తథ్యం అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో షాక్ తగిలిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తొలి విడతలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య శూన్యమేనన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. పెట్టని కోటగా బీజేపీ భావిస్తున్న ఉత్తరప్రదేశ్ లో సైతం బీజేపీకి ఆ పార్టీ ఊహిస్తున్న విధంగా సానుకూలత లేదని తొలి విడత పోలింగ్ స్పష్టం చేసిందంటున్నారు. ఇక రెండో విడతలోనూ బీజేపీకి భంగపాటే ఎదురైందని అంటున్నారు. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ రెండు విడతల్లో దేశ వ్యాప్తంగా 190 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ రెండు విడతల్లోనూ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలకే సానుకూలంగా పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ కారణంగానే బీజేపీలో అంతర్మథనం మొదలైందని, అందుకే మోడీ పరిధులు మరిచి మరీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం ఆరంభించారని చెబుతున్నారు.  ఎన్నికల నియమావళిని ఇసుమంతైనా పట్టించుకోకుండా  మతపరమైన పోలరైజేషన్‌ కోసం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ కు గురి చేశాయి. మైనారిటీ వ్యతిరేకతను ఈ పదేళ్లుగా ముసుగులో దాచేసిన ఆయన ఒక్కసారిగా ముసుగు తీసేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయన చేస్తున్న ప్రసంగాల పట్ల ఎన్నికల కమిషన్ స్పందించలేదు.  

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికీ నేటికీ   దేశ రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్స్‌ బహిర్గతం అవ్వడంతో ఆ బాండ్ల వల్ల అధిక లబ్ధి పొందిందెవరన్నది ప్రస్ఫుటంగా దేశ ప్రజలందరికీ బ్లాక్ అండ్ వైట్ లో అవగతమైపోయింది. ఆ తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం  దేశ రాజకీయాలలో సంచలనానికి కారణమైంది. ఈ కేసులో ఇంత కాలం ఊరుకుని సరిగ్గా ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ఈడీని ప్రశ్నించడం.. ఈ అరెస్టు రాజకీయపరమైనదేననే భావన ప్రజలలో కలిగింది.  వేర్వురు పార్టీలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఈడీ, సీబీఐ, ఐటీల నుంచి రక్షణ పొందాలంటే బీజేపీలో చేరడమొక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారనీ, అటువంటి వారిని దరికి చేర్చుకుని బీజేపీ అవినీతి పరులకు ఆశ్రయ కేంద్రంగా మారిపోయి తద్వారా రాజకీయలబ్ధి పొందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజజలలో ఆ అసంతృప్తి ఎన్నికలలో ప్రతిఫలిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశలలోనూ ప్రస్ఫుటంగా కనిపించిందని అంటున్నారు. 

ఇక గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లిన నిరుద్యోగం కారణంగా యువతలో కూడా పదేళ్ల మోడీ పాలనపై అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలోని 30 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   రైతు ఆదాయం రెట్టింపు అంటూ ఊరూవాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న మోడీ సర్కార్ వారికి కనీస మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమైంది. తమ సమస్యలపై గళమెత్తిన రైతులపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం మోడీ సర్కార్ పై  కన్నెర్ర చేసిన పరిస్థితి ఉంది.వెరసి ఈ వర్గాలన్నీ మోడీ సర్కార్ తీరు పట్ల తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఎన్నికలలో ఓటు ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించుకోవడం వల్లనే బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు.