మాస్క్ లేకుండానే అసెంబ్లీకి జగన్.. జనానికిదేనా సంకేతం! 

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి మరణ మృందగం మోగిస్తోంది. దేశంలో ఎక్కువ పాజిటివిటి రేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లోనే ఉంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో ఏపీ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఏపీలో గుర్తించిన వైరస్ వేరియెంట్ ప్రమాదకరమనే ప్రచారం జరుగుతోంది. కరోనా కట్టడికి మాస్క్ అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఏపీలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. కొవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రభుత్వ అధినేతగా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగనే వాటిని అతిక్రమిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్ ధరించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనే మాస్క్ లేకుండానే పాల్గొన్నారు సీఎం జగన్. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.

బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. టీడీపీ బహిష్కరించగా.. వైసీపీ సభ్యులే సభకు హాజరయ్యారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అసెంబ్లీకి మెజార్టీ సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీకి వచ్చిన జగన్.. మాస్క్ లేకుండానే కూర్చున్నారు. సభ జరిగినంత సేపు మాస్క్ ధరించలేదు ముఖ్యమంత్రి. మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. మాస్క్ లేకుండా బయటికి వచ్చిన వారికి పోలీసులు ఫైన్ కూడా వేస్తున్నారు. సీఎం జగన్‌ తో పాటు పలువురు మంత్రులు మాస్క్‌లు లేకుండానే వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పే ముఖ్యమంత్రి, మంత్రులు.. మాస్కులు ధరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాని సీఎం జగన్ మాత్రం వందలాది మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీ హాల్ లో మాస్క్ లేకుండానే సంచరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  మాస్క్ నిబంధనలు ప్రజలకేనా..? సీఎం జగన్, మంత్రులకు వర్తించవా? అంటూ చర్చ జరుగుతోంది. మాస్క్‌లు ధరించాలంటూ అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో చెవిరెడ్డితో పాటు సీఎం జగన్‌కు మాస్క్‌లు లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మాస్క్ లేకుండా సభలో పాల్గొన్న సీఎం  జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ మాస్కు పెట్టుకోవ‌ట్లేద‌ని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 'ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారు?' అని లోకేశ్ ప్ర‌శ్నించారు.
 
'తొలి విడ‌త‌లో కొవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చ‌ల్లితే చ‌స్తుంది.. ఇట్ క‌మ్స్ ఇట్ గోస్.. ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారు' అని లోకేశ్ విమ‌ర్శించారు. 'సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మ‌శానంగా మారుతుంటే చిరున‌వ్వులు చిందిస్తూ, మీరే మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెన్ని వేల‌మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మ‌నిషిన‌ని నిరూపించుకుంటారో మీ ఇష్టం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.