రాజధానిపై రాద్దాంతం చేసుకొంటే...

 

తూళ్ళూరు మండలంలో గల 25గ్రామాల నుండి వచ్చిన 300మంది రైతులతో నిన్న సమావేశమయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానికి భూసేకరణ విషయంలో వారిలో నెలకొన్న అనుమానాలను, భయాందోళనలను నివృతి చేసి, రైతులకు వారి భవిష్యత్ పట్ల భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. రైతులకు భూములతో తరతరాలుగా ఉన్న అనుబందం గురించి తాను అర్ధం చేసుకోగలనని, కానీ రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడు త్యాగం చేసినట్లయితే వారికే ఆ కీర్తి, ఫలాలు అన్నీ దక్కుతాయని, అందువల్ల ప్రతిపక్షాల మాటలకు చెవొగ్గి ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దని ఆయన రైతులకు సలహా ఇచ్చారు. వారి భవిష్యత్తుకు, భద్రతకు తాను హామీ ఇస్తున్నానని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. కేవలం నోటి మాటలతోనే కాకుండా ఆరు నెలలలోగా రైతులు ఇస్తున్న భూములకు రికార్డులన్నీ సరిచేయించి, వారు తిరిగి పూర్తి ప్రయోజనం పొందే విధంగా శాసనసభ ద్వారా చట్టబద్దత కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు.

 

ఈ భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే నిరుపేద వ్యవసాయ కూలీలకు తగిన శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే వారికి ఉపాధి మార్గం చూపిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇళ్లులేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన భరోసాతో కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించగా మరి కొందరు ఇంకా అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం అంత తేలికగా పరిష్కరించగలిగేది కాదని మాత్రం చెప్పవచ్చును.

 

ముఖ్యమంత్రి స్వయంగా వారితో మాట్లాడినప్పటికీ, ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న ప్యాకేజీ వివరాలను ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించినట్లయితే రైతులకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. భూసేకరణ కోసం మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీని వేసినట్లే, రైతులకు ప్రభుత్వం ఈయదలిచిన ఇతర పరిహారాలను, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను, సంక్షేమ, శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తూళ్ళూరు మండలానికి చెందిన రైతులతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థను, దాని కార్యాలయాన్ని తూళ్ళూరులోనే ఏర్పాటు చేయడం వలన కూడా రైతులలో నెలకొన్న ఈ అనుమానాలు, అపోహలు తొలగించవచ్చును. ఆ కార్యాలయమే అటు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారదిగా నిలుస్తుంది కనుక రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి దిక్కులు చూడవలసిన ఆగత్యం తప్పుతుంది.

 

ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసి, రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారనే అప్రతిష్ట మూటగట్టుకొనే బదులు రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకు తాము వారికి అండగా ఉంటామనే భరోసా కల్పిస్తే బాగుంటుంది. రాష్ట్ర విభజన వ్యవహారాన్ని రాష్ట్ర స్థాయిలో చర్చించుకొని పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ అందరూ పంతాలు పట్టింపులకీ పోయినందునే దేశ ప్రజల దృష్టిలో తెలుగు ప్రజలు చులకనయ్యారు. పిట్టల పోరు పిల్లి తినేసి తీర్చినట్లుగా రాష్ట్ర రాజకీయపార్టీల చేతగానితనం కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం తనకు ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర విభజన చేసి అందరికీ కష్టాలు మిగిల్చింది.

 

మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అటువంటి పరిస్థితే పునరావృతం కాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు విజ్ఞతతో మెలగవలసి ఉంటుంది. అందరూ కలిసి ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మించుకొని దేశానికే ఆదర్శంగా నిలవాలి తప్ప నలుగురిలో నవ్వులపాలయ్యేవిధంగా వ్యవహరించడం ఎవరికీ గొప్ప విషయం కాదు.