తెలంగాణా యుద్దభూమిలోకి షర్మిలను పంపడం దేనికో?

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రల ద్వారా ప్రజలను ఆకట్టుకొని రాష్ట్రంలో తన పార్టీని బలపరుచుకోవాలనుకొన్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే దానికి బదులు ఆయన గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేసి ఉండి ఉంటే ఆయన ఆశించిన ప్రయోజనం నెరవేరి ఉండేదేమో. కానీ అయన ఈ ‘షార్ట్ కట్’ పద్దతిలో పైకి ఎదగాలనుకోవడం వల్లనే నేటికీ పార్టీ అనేక జిల్లాలలో చాలా బలహీనంగా మిగిలిపోయింది. అయితే ఆయన గతం నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోలేదని ఆయన సోదరి షర్మిల త్వరలో తెలంగాణా చేపట్టబోతున్న ‘పరామార్శ యాత్ర’ దృవీకరిస్తోంది.

 

కష్టాల్లో ఉన్నవారిని పరామార్శించడాన్ని ఎవరూ కూడా తప్పు పట్టరు. కానీ వారి కష్టాలను తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడాన్ని ఎవరూ సమర్ధించబోరు. తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటున్న వైకాపా అందుకోసం ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను, పంటలకు నీళ్ళందక కన్నీళ్ళు పెట్టుకొంటున్న రైతన్నలను పరామార్శించే సాకుతో యాత్రలు చెప్పట్టాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచనని చెప్పక తప్పదు. (రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు).

 

తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటే అందుకు నేరుగానే ప్రయత్నాలు చేసుకోవచ్చును. తెలంగాణాలో మిగిలిన పార్టీనేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి పార్టీని మళ్ళీ ఈవిధంగా బలపరుచుకోవాలని చర్చించాలని ప్రయత్నించే బదులు కష్టాల్లో ఉన్న రైతులకు సానుభూతి చూపిస్తూ అందుకు ప్రతిగా తిరిగి వారి నుండి పార్టీ సానుభూతి పొందాలను కోవడం ఆ పార్టీకి రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఎటువంటిదో స్పష్టం చేస్తోంది. ఈవిధమయిన ఆలోచనలు చేయడాన్ని ఎవరూ కూడా హర్షించరు...సమర్దించలేరు కూడా. ముఖ్యంగా తెలంగాణా ప్రజలు.

 

ఒకప్పుడు తెలంగాణా ప్రజల సెంటిమెంటు గౌరవిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం తన పార్టీ నేతలయిన కొండా సురేఖ వంటి తెలంగాణా నేతల మనోభావాలను కూడా గౌరవించకుండా, వారి సలహాలను పెడచెవిన పెట్టి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ తెలంగాణా నుండి బయటపడ్డారు. ఆవిధంగా చేసి తెలంగాణా ప్రజల, తన పార్టీ నేతల మనసు నొప్పించిన జగన్మోహన్ రెడ్డి, సమైఖ్యాంధ్ర శంఖం పూరించి సీమాంధ్ర ప్రజల ఓట్లు పిండుకొందామని చేసిన ప్రయత్నం కూడా ఫలించక పోవడంతో ఆయన పార్టీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. అందుకే ప్రజలు కూడా ఆ పార్టీని, అది చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని కూడా అనుమానంగానే చూస్తుంటారు. అయినప్పటికీ ఆ పార్టీ అధినేత గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా మడమ తిప్పకుండా అదే పద్దతిలో ముందుకు సాగాలనుకోవడం విశేషమే. అందుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేని షర్మిల సేవలను ఉపయోగించుకోవాలనుకోవడము కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో ఉన్నపుడు, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఇరువురు ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేసారు. అందులో వారు చాలా వరకు సఫలీకృతులయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీని చూసుకొంటునప్పుడు తను వెళ్ళకుండా షర్మిలను పంపిస్తున్నారు. ‘యుద్దంలో దిగినవాడికి గుండెల నిండా దైర్యం ఉండాలి’ అని గొప్పగా చెప్పుకొనే ఆయన పార్టీకి పూర్తి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న తెలంగాణా యుద్దభూమిలోకి తను వెళ్ళకుండా చెల్లెలు షర్మిలను పంపించడం దేనికంటే అక్కడ ప్రజా వ్యతిరేఖతను తను తట్టుకోలేననే ఆలోచనతోనే అని చెప్పక తప్పదు. ఆమె పర్యటనతో పరిస్థితి కొంచెం మెరుగుపడితే బహుశః అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం చేస్తారేమో? కానీ షర్మిల వంటి వారు పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగా కృషి చేసినప్పటికీ, పార్టీలో “విశ్వసనీయత” లేకపోతే అది ఎన్నటికీ ప్రజల ఆదరణకు నోచుకాదు. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ద్వంద వైఖరిని విడనాడటం చాలా అవసరం.