ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది కానీ..
posted on Feb 14, 2015 11:08AM
.jpg)
గవర్నరు నరసింహన్ సమక్షంలో ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రుల సమావేశం కొద్ది సేపటిక్రితమే ముగిసింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున్ సాగర్ నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 10టియంసీల నీళ్ళు విడుదల చేసేందుకు అంగీకరించారు. మళ్ళీ వచ్చే ఖరీఫ్ సీజన్ లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అంతే మొత్తం నీళ్ళు తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తాజా సమాచారం. సాగర్ డ్యాం వద్ద కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ న్ని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులు ఇరువురూ సమావేశం పూర్తికావడంతో రాజ్ భవన్ నుండి వెళ్ళిపోయారు. కానీ ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు మరియు హరీష్ రావు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఇంకా గవర్నర్ సమక్షంలోనే చర్చలు కొనసాగిస్తున్నారు. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల అధికారులు పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో మళ్ళీ మరోమారు తన వద్దకు రావాలని గవర్నర్ నరసింహన్ మంత్రులను అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపటిలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులు మీడియా ముందుకు వచ్చి తమ సమావేశ వివరాలను వెల్లడించవచ్చును.