సంగంలో మ‌ళ్లీ సోదాలు.. హైకోర్టు ఆదేశాలు బేఖాత‌రు..

హైకోర్టు చెప్పినా విన‌టం లేదు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరు మార‌డం లేదు. పాల‌కుల ఒత్తిడితో పోలీసులు సంగం డెయిరీ మీద కుట్ర‌లు ఆప‌డం లేదు. సాక్షాత్తూ రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పునే తుంగ‌లో తొక్కుతున్నారు. న్యాయ‌స్థానం ఆదేశాల‌కూ బెద‌ర‌కుండా బ‌రితెగిస్తున్నారు. మ‌రోసారి సోదాల పేరుతో సంగం డెయిరీ రోజువారీ కార్య‌క్ర‌మాల డేటాను త‌స్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. డెయిరీ సిబ్బంది ఎదురు తిర‌గ‌డంతో సంస్థ కార్యాల‌యం ముందు ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు వెంట‌నే సోదాలు ఆపి అక్క‌డి నుంచి వెళ్లిపోవాలంటూ ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగడంతో హైటెన్ష‌న్ నెల‌కొంది. 

శుక్ర‌వారం ఉద‌యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనంపై సర్కార్ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంగం డెయిరీని ఏపీ డెయిరీలో విలీనం చేస్తూ సర్కార్ ఇచ్చిన జీవో చెల్లదని  హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోజువారి డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు పర్యవేక్షించాలని సూచించింది ధర్మాసనం. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది . 

సంగం డైయిరీలో ఏసీబీ సోదాలు పేరిట డేటా చౌర్యం జరగబోతోందని పాలకవర్గం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఎఫ్ఐఆర్లో తెలిపిన అంశాలు మినహా.. మిగతా పాల కొనుగోళ్లు, అమ్మకాలు, మార్కెటింగ్ తదితర విషయాలలో ఏసీబీ పోలీసులు జోక్యం చేసుకోరాదని.. డేటాను యాక్సెస్ చేయడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ధ‌ర్మాస‌నం ఇంత సుస్ప‌ష్టంగా ఆదేశాలు ఇచ్చినా.. తీర్పు వెలువ‌డిన కొన్ని గంట‌ల్లోనే ఏసీబీ మ‌ళ్లీ సంగం డెయిరీలో చొర‌బ‌డింది. త‌నిఖీల పేరుతో.. సంగం డెయిరీ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. సోదాలంటూ రోజువారీ కార్య‌క‌లాపాల డేటాను హ్యాక్ చేసి ప‌రిశీలిస్తుండ‌గా.. డెయిరీ సెక్యూరిటీ వింగ్ ఆ విష‌యాన్ని గుర్తించారు. వెంట‌నే సోదాల‌ను ఆపేయాల‌ని ఉద్యోగులంతా ధ‌ర్నాకు దిగారు. ఏసీబీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. వంద‌లాది మంది సిబ్బంది ధ‌ర్నాతో సంగం డెయిరీ కార్యాల‌యం ముందు తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. హైకోర్టు ఆదేశాల‌ను ఇంత బ‌హిరంగంగా ఉల్లంఘించ‌డంపై సంగం ఉద్యోగులు మండిప‌డుతున్నారు. త‌నిఖీల‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.