కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్రం అప్రమత్తం
posted on Apr 29, 2025 12:50PM

కాశ్మీర్ లోని పహల్గాంలో గత వారం జరిగిన ఉగ్ర దాడి ఉద్రిక్తతలు ఇంకా చల్లారక ముందే.. అదే కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రవాదులకు ముష్కరులు ప్రణాళికలు రచిస్తున్నారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలలో స్థానికేతరులు, భద్రతా దళాలు టార్గెట్ గా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గాం దాడి తరువాత కేంద్రం కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదుల గృహాలను ధ్వసం చేయడానికి ప్రతీకారంగా మరిన్ని దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది.
ముందు జాగ్రత్తగా కాశ్మీర్ లోని 84 పర్యాటక ప్రాంతాలలో 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించడం లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి పర్యాటకుల కోసం తెరుస్తామని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అనుమతి ఇస్తున్న పర్యాటక ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. భద్రత కల్పించిన ప్రాంతాలలోకి పర్యాటకుల ఎటువంటి భయం లేకుండా సంచరించవచ్చని భరోసా ఇచ్చింది. ప్రతి పర్యాటకుడికి ఆయా ప్రాంతాలలో ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా భద్రతా సిబ్బందిని నియమించింది.