అన్న క్యాంటీన్లకు భువనేశ్వరి కోటి విరాళం!

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్ల కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం అని ఈ సందర్భంగా భువనేశ్వరి అన్నారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది స్వర్గీయ ఎన్టీఆర్ నినాదమని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతు మద్ధతుగా ఉండాలనే ఉద్దేశ్యంతో విరాళం అందించినట్లు పేర్కొన్నారు. ఐదు రూపాయలకే కడుపు నింపడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం అని, పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి భువనేశ్వరి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఎన్ని సంక్షేమ పథకాలున్నా పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనది అన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.