వినేశ్ ఫొగాట్ కేసు.. అప్పీల్ తిరస్కరణ!

ఇండియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్.లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్ చేసిన అప్పీల్‌ని ‘కాస్’ కొట్టేసింది. ఫైనల్‌కి చేరిన తర్వాత అనర్హత వినేశ్‌పై వేటు వేయడంతో తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ తన అప్పీల్లో కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ‘కాస్’ అడాక్ డివిజన్ బుధవారం తీర్పు వెల్లడించింది. ఫొగాట్ చేసిన అప్పీల్‌ని ‘కాస్’ తిరస్కరించిందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

"యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) విధించిన అనర్హత వేటును సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ని కాస్ తిరస్కరించడం దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసింది. రజత పతకం ఇవ్వాలని వినేశ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ కాస్ ఆగస్టు 14న తీర్పును ఇచ్చింది" అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పారిస్ ఒలింపిక్స్.లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అదనంగా బరువు ఉందని వినేశ్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడంతోపాటు 50 కిలోల ఫైనల్లో ఓడిన లోపెజ్ (క్యూబా)తో కలిపి తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ అప్పీలు చేసిన విషయం తెలిసిందే.