స్వాతంత్య్ర దినోత్సవం.. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం!

పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున  తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్న సమయంలో 2019 జూన్‌ నెల ముందువరకు పేదలకు మూడు పూటలా  కడుపు నింపిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మూసేసింది. ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా శిథిలావస్థకి తీసుకెళ్ళింది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్‌లు ఏ పాపం చేశాయి? అవసరమైతే పేరు మార్చుకుని కొనసాగించండి అంటూ  ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించినా జగన్ రాతిగుండె కరగలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లను నిర్వహించే ప్రయత్నాలను కూడా అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తూ, పేదల ఆకలి తీర్చారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అన్న క్యాంటిన్‌లు పునఃప్రారంభిస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. తొలివిడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటిన్లను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ అన్న క్యాంటీన్లన్నీ సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి.