మద్యం కుంభకోణం గుట్టురట్టు? సిట్ కు ఆధారాలు అందించిన మద్యం కంపెనీల యాజమాన్యాలు
posted on May 20, 2025 9:25AM
.webp)
నిజం నిప్పులాంటిది. అధికారం ఉందికదాని దానిని గుప్పిట మూసి ఉంచుదామంటే కుదరదు. చేయి కాలిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ.. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కోట్లు దండుగున్న అవినీతి తిమింగళాల గుట్టు బయటపడుతోంది. అవును మద్యం కుంభకోణం గుట్టు రట్టౌతోంది. ఈ కుంభ కోణంలో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా వాస్తవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు బాధితులు. వాస్తవానికి ఈ కుంభకోణంలో బాధితులైన వారు లిక్కర్ కంపెనీల యజమానులు. ముడుపులు ఇచ్చి ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందు తాము ఇచ్చిన ముడుపులు, వాటిని తీసుకున్న వారి వివరాలను బయటపెడుతున్నారు.
తాజాగా ఆర్థోస్ అనే కంపెనీ యజమాన్యం దర్యాప్తు అధికారులకు విస్తుపోయే వాస్తవాలను వివరించారు. తుపాకీని తమ కణతకు గురిపెట్టి మరీ దోపిడీ చేశారని వివరించింది. అలా తమ ప్రాణాలు తీస్తామని బెదిరించింది మరెవరో కాదు.. వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి అని దర్యాప్తు అధికారులకు తెలిపింది. ఖజురహో అనే బ్రాండ్ మద్యాన్నిసరఫరా చేయడానికి తమకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. అందుకోసం ముడుపులు తీసుకున్నారని వివరించింది.
వాస్తవానికి జగన్ హయాంలో లిక్కర్ కంపెనీలను చాలా వరకూ వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తిని గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని కంపెనీల్లో కేసు బాటిల్స్ కు ఇంత అని చెప్పి కమిషన్ వసూలు చేశారు. ఆ కమిషన్ ను నగదు రూపంలోనే కాకుండా.. బంగారం సహా ఇతర మార్గాల్లో వసూలు చేసుకున్నారు. ఇందు కోసం తప్పుడు కంపెనీలు సృష్టించారు. ఖర్చు లేని చోట ఖర్చు చూపించారు. లాజిస్టిక్స్అదనీ, ఇదనీ ఇష్టారీతిగా ఖర్చులు చూపించారు. ఇతర ఖర్చులు చూపించారు.
ఇప్పుడు దర్యాప్తులో భాగంగా లిక్కర్ కంపెనీల యజమానులు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇంకా ధైర్యం చేయకపోయినా.. తాము ముడుపులు ఎలా చెల్లించామన్న వివరాలను వెల్లడించారు. తాము కేసుల్లో ఇరుక్కోకుండా, తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా జాగ్రత్తపడుతూనే.. ఐదేళ్ల పాటు జలగల్లా తమ రక్తాన్ని పీల్చేసిన వారికి సంబంధించిన వివరాలను, వారెలో దోపిడీ చేశారో అందుకు అవసరమైన ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేస్తున్నారు. ఆ వివరాలు, ఆధారాలను సేకరించిన సిట్ ఇక మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు.