రాహుల్ గాంధీ పోరాటం ఎవరి కోసం?

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను తాను రీ-చార్జ్ చేసుకొనేందుకు దాదాపు రెండు నెలలు శలవు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రీచార్జ్ అయినందున ఇంతకు ముందులాగ లోక్ సభ వెనుక బెంచీలలో కూర్చొని కునుకు తీయకుండా అనర్గళంగా మాట్లాడేసి కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేత చప్పట్లు చరిపించుకొన్నారు. ఆ తరువాత నిన్న సాయంత్రం సాధారణ ప్రయాణికులతో కలిసి జనరల్ కంపార్ట్ మెంటులో పంజాబ్-హర్యానా సరిహద్దులోగల అంభాలా పట్టణానికి ప్రయాణించి మరో మారు మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు.

 

తమ యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఎన్డీయే ప్రభుత్వం సవరించి ఆర్డినెన్స్ జారీ చేసిన తరువాత దేశ వ్యాప్తంగా రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని, వారి బాధలను కళ్ళార చూసేందుకే బయలుదేరుతున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే ఇదే పనిమీద అయన దేశంలో పలు రాష్ట్రాలలో పాదయాత్రలు చేప్పట్టబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ దృవీకరించింది. భూసేకరణ బిల్లుకి సవరణలు చేయడం వలన రైతుల ప్రయోజనాలు దెబ్బ తింటాయని కాంగ్రెస్ పార్టీతో సహా చాలా పార్టీలు దానిని వ్యతిరేకిస్తున్నాయి. వాటిలో చాలా పార్టీలు తమతమ రాష్ట్రాలలో నిరసన సభలు, ధర్నాలు కూడా నిర్వహించాయి. కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానిపై సకాలంలో స్పందించలేదు.

 

బహుశః ఆ అంశంపై పోరాటం చేసే అవకాశం రాహుల్ గాంధీకి విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం పెద్దగా స్పందించలేదేమో? రాహుల్ గాంధీ శలవు నుండి తిరిగి వచ్చిన తరువాతనే డిల్లీలో భూసేకరణ చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన సభ నిర్వహించడం గమనిస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ అంశం గురించి పోరాటం మొదలుపెట్టేశారు గనుక ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందేమో?అంటే భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ఈ పోరాటం రైతుల కోసమా లేకపోతే ఆయన పరపతి పెంచుకొనేందుకా? అనే ధర్మసందేహం కలుగుతోంది.

 

రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవడానికి గతంలో చాలా అవకాశాలు వచ్చేయి. కానీ అప్పుడు చొరవ చూపకపోవడం వలన ఆయనకి బొత్తిగా నాయకత్వలక్షణాలు లేవనే అపవాదొకటి ఏర్పడింది. కనుక తనకు పెద్దగా ఇబ్బంది కలిగించని ఈ అంశాన్ని అందిపుచ్చుకొని పోరాటం చేయడం ద్వారా ఆ అపవాదుని వదిలించుకోవచ్చునని, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పట్టాలని భావిస్తున్నారేమో? ఇటువంటి దురాలోచనలు చేయడం వలననే దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా అనేకరాజకీయ పార్టీలను ప్రజలు త్రిప్పి కొడుతున్నారు. అయినా అవి తమ తీరు మార్చుకోకుండా ఇటువంటి నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం విస్మయం కలిగిస్తోంది.