దళితులపై వరస దాడులు.. జగన్ పాలనలో పరాకాష్టకు పైశాచికత్వం!
posted on Nov 7, 2023 8:50AM
ఏపీలో మరో అరాచక, పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. ఆరుగురు వ్యక్తులు దళితుడిపై దాడి చేసి మంచినీళ్లు అడిగితే మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని శ్యామ్ కుమార్‌గా గుర్తించగా.. నిందితులు ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు నిందితులు దళిత వ్యక్తిని వాహనంలో ఎక్కించుకొని వెళ్లి నాలుగు గంటలపాటు ఇష్టారాజ్యంగా చితకబాదారు. అనంతరం బాధితుడు తీవ్ర గాయాలపాలవడంతో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసేందుకు తీసుకెళ్తుండగా అతను నీళ్లు కావాలని అడిగాడు. దీంతో అతన్ని వాహనం నుండి దించి కూర్చోబెట్టి నిందితులు ఆరుగురు అతని చుట్టూ తిరుగుతూ అతనిపై మూత్ర విసర్జన చేశారని అధికారులు తెలిపారు.
బాధితుడు శ్యామ్ కుమార్ పై నిందితుడు దాడి చేసే సమయంలో ఇప్పుడు మాదే అధికారం, మేమేం చేసినా చెల్లుతుందంటూ చితకబాదారు. మేము అధికారంలో ఉన్నంత కాలం మీరు మమ్మల్ని ఏం చేయలేరంటూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడినట్లు పోలీసులే తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి ఈ నిందితులకు ఎలాంటి సంబంధం లేకపోయినా నిందితులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. స్థానిక వైసీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఎవరూ అడగకుండానే పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ ఆరుగురు రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారేనని తెలుస్తుండగా.. నిందితులు వైసీపీ కార్యకర్తలా కదా అన్న అంశంపై మాత్రం పోలీసులు స్పందించలేదు. ఈ సంఘటన తెరపైకి వచ్చిన తర్వాత టీడీపీ ఎస్సీ సెల్ నిరసన చేపట్టి రోడ్లను దిగ్బంధించింది. కంచికచర్ల సమీపంలో హైవేను దిగ్బంధించి టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎంఎస్ రాజు ఆధ్వర్యంలో హైవేకు ఇరువైపులా నిరసన ధర్నా నిర్వహించారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దళితులపై ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయన్నది చర్చకు వస్తున్నది. గతంలో కరోనా సమయంలో విశాఖ జిల్లాలో దళిత వైద్యుడు మాస్కులపై ప్రశ్నించగా.. అతన్ని పిచ్చి వాడిగా ముద్రవేసి గుండు కొట్టించి చేతులు విరిచి కట్టేసి పోలీసులతో చితకబాదించారు. అతన్ని ఉద్యోగం నుండి కూడా తొలగించడంతో మానసికంగా కృంగిపోయి అతను మరణించాడు. చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసే దళిత డ్రైవరును చంపేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీని వైసీపీ పెద్దలు సమావేశాలలో పక్కనే కూర్చోబెట్టుకొని ఫోజులిస్తున్నారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. అదే జిల్లాకు చెందిన వైద్యురాలు అనితారాణిని కూడా అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధించారు. పోలీసులు వేధించడంతో కాకినాడ జిల్లాకు చెందిన ఆలపు గిరీష్ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవి కాకుండా వేధింపులు భరించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడగా వాటిని అనుమానాస్పద కేసులుగా మూసేసినట్లు ఆరోపణలున్నాయి. ఆస్తుల ధ్వంసం, ఇళ్లపై దాడులు చేసిన సంఘటనలు, దళిత బాలికలు, యువతులు, మహిళపై అత్యాచారాలకు దిగిన ఘటనలు ఎన్నో ఉండగా.. ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ జిల్లాలో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. దీంతో అసలు వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే ఎందుకింత చులకనని దళిత సోదరులు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిజానికి వైసీపీ అధికారంలోకి రావడంలో దళితులే కీలకంగా వ్యవహరించారు. కానీ వారిపై చిన్నచూపో.. ఏం చేసినా భరిస్తారనే నమ్మకమో.. అధికారం మాదే కనుక అడిగేవారు లేరన్న అహంభావమో.. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు భయాందోళనలు కలిగిస్తున్న మాట వాస్తవం.