ఆంధ్రా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇలా తయారయ్యారేంటి?

విభజన కారణంగా 40 శాతం, జగన్ కారణంగా 60 శాతం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల నుంచి త్వరగా బయటపడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలని ఆశిస్తున్నారా? ఎక్కువగా ఆశించకండి.. ఎందుకంటే ఎక్కువగా ఆశపడటం ఎందుకు... మళ్ళీ నిరాశకు గురవటం ఎందుకు? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. కానీ, ప్రభుత్వానికి సహకరించడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన జగన్ అండ్ కో, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జనం మీద పగబట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా వుండటానికి ఏం చేయాలో అవన్నీ చాపకింద నీరులా చేస్తూనే వున్నారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయేవిధంగా, పెట్టుబడిదారులు వెనకడుగు వేసే విధంగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. జగన్ అండ్ కో పరిస్థితి ఇలా వుంటే, కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రా ముఖం చూడటానికే ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినవాళ్ళ నుంచే నిరాదరణను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఏనాటికి అభివృద్ధి చెందుతుందో ఏంటో!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర కేడర్‌కి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో ఉండిపోయారు. అదేవిధంగా తెలంగాణ కేడర్‌కి, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రలో వుండిపోయారు. ఆంధ్రలో వున్న తెలంగాణ అధికారులు ఎప్పుడెప్పుడు తెలంగాణకు వెళ్ళిపోవాలా అని ఎదురుచూస్తూ వున్నారు. తెలంగాణంలో వున్న ఆంధ్ర అధికారులు ఆంధ్ర పేరు చెబితేనే గిట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఇష్టం లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

విభజన తర్వాత ఏపీకి కేటాయించినా కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తెలంగాణలో కొనసాగుతున్నారు. వారిలో వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ప్రశాంతి... ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వున్నారు. వీరిలో కొంతమంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ, ఆంధ్రా కేడర్ అధికారులు. మరికొందరు ఆంధ్రా ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన స్వచ్ఛమైన ఆంధ్రులు. చట్టపరంగా, న్యాయంగా అయితే, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలి. కానీ, మేం వెళ్ళబోం అంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్)ని ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళందరూ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజాగా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కే వెళ్ళి తీరాలని కేంద్రానికి చెందిన డిపార్ట్.మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించింది. సాధారణంగా అయితే డీఓపీటీ ఆదేశిస్తే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చప్పుడు చేయకుండా చెప్పినట్టు వినాలి. కానీ, ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రాకి వెళ్ళడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. డీఓపీటీ ఆదేశాల మీద కూడా కోర్టును ఆశ్రయించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి, వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడానికి అధికారులు బాధపడిపోతున్నారు. అలాగే ఏపీలో వున్న తెలంగాణ కేడర్ వాళ్ళు ఆనందోత్సాహాలతో తెలంగాణకు వస్తున్నారు. అక్కడి వారు ఇక్కడికి వస్తున్నారుగానీ, ఇక్కడి వాళ్ళు అక్కడకి వెళ్ళడానికి బాధపడిపోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో పుట్టిపెరిగి, ఆంధ్రా కేడర్‌కి ఎంపికైన వాళ్ళ సంగతి అలా వుంచితే, ఆంధ్రాలో పుట్టి పెరిగిన రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటా, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి లాంటి వాళ్ళు కూడా సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి విముఖత చూపించడం చాలా బాధాకరమైన విషయం. విభజన కారణంగా నష్టపోయిన తమ సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు పాత్రను పోషించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా ఈ అధికారులు వ్యవహరిస్తూ వుండటం దురదృష్టకరం. ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాల్సిందే అనే పరిస్థితి వస్తే, వీళ్ళు ఏపీలో బాధ్యతలు తీసుకున్నా పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేస్తారా అనే సందేహాలు వున్నాయి.