జగన్ భయపడుతున్నారా? అందుకే ఆ ప్రకటన చేశారా?

 

సీఎంవో అంటే సాక్షాత్తు సీఎమ్మే. సీఎంవో ఏదైనా ప్రకటన విడుదల చేసిందంటే అది సీఎం చెప్పినట్లే. అలాంటి ఓ పత్రికా కథనంపై ఏకంగా సీఎం... అదే సీఎంవో వివరణ ప్రకటన ఇవ్వడం ఏపీలో సంచలనంగా మారింది. కేంద్రం తీరుపై కేసీఆర్-జగన్ గుర్రుగా ఉన్నారంటూ వచ్చిన కథనంపై ఏపీ సీఎంవో క్లారిఫికేషన్ ఇవ్వడంపై విస్తృత చర్చ జరుగుతోంది. మోడీ-షా అంటే జగన్ భయపడుతున్నారని మాట్లాడుకుంటున్నారు. నిజానికి ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం నిజమే అయినా, ఇప్పటికిప్పుడు మోడీ-షాని ఢీకొట్టేందుకు జగన్ సిద్ధంగా లేరనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ఒకవైపు రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా మారుతుండటం... మరోవైపు కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదనే అసహనం ఇద్దరు ముఖ్యమంత్రుల్లోనూ ఉంది. అయితే, కేంద్రంతో పోరాడేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నా, జగన్ అందుకు రెడీగా లేకపోవడంతోనే, ఏకంగా సీఎంవోతో ప్రకటన ఇప్పించారు. అంటే స్వయంగా ముఖ్యమంత్రే ఆ కథనాన్ని ఖండించారని అనుకోవాలి.

పోలవరం కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, పీపీఏల పునసమీక్ష, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా... ఇలా అనేక విషయాల్లో జగన్ సర్కారుకు కేంద్రం మొండిచేయే చూపుతోంది. ఇక, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లోనూ పక్షపాతం చూపుతోందని, ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం ఉండటం లేదని, పైగా రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అస్సలు ఆదుకోవడం లేదనే కోపం ముఖ్యమంత్రి జగన్ లో ఉన్నా, పోరాడేందుకు మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే, అపర కాళిలాంటి మమతాబెనర్జీనే... మోడీ-షా ముందు తోక ముడవాల్సి వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతోను, కేంద్రంతోనూ తగువు పెట్టుకుంటే, అసలుకే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు. దేశంలోనే అత్యంత శక్తిమంతులుగా మారిన మోడీ-షాను ఎదిరించడమంటే... తమ గోతిని తామే తవ్వుకున్నట్లు అవుతుందని జగన్ ఎప్పుడో అంచనాకి వచ్చేశారు. పైగా మోడీ-షాను ఎదిరించినా పెద్దగా ఒరిగేమీ ఉండదని చంద్రబాబు ఎపిసోడ్ తో అర్ధమైందని, అందుకే, ఆ ప్రతికా కథనాన్ని ఖండించి జగన్ తెలివిగా వ్యవహరించారని అనుకుంటున్నారు.

అయితే, చంద్రబాబు కూడా నాలుగేళ్లు వేచిచూసి విసిగిపోయే, ఎన్డీఏ నుంచి బయటికొచ్చి, కేంద్రంపైనా, బీజేపీపైనా మోడీపైనా ఆనాడు యుద్ధం ప్రకటించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడారని, ఆ తర్వాతే చంద్రబాబుకి కష్టాలు మొదలయ్యాయని టీడీపీ నేతలు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నిరోజులు కేంద్రం విషయంలో మౌనంగా ఉంటారో... రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడంలో ఎంతవరకు సహనంగా ఉంటారో... అసలు నోరే విప్పరో... రానున్న రోజుల్లో తేలనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu