అమరావతి రాజధాని కోసం ఎందాకైనా..!

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

ఇంతకు ముందు వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమల వరకు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి విదితమే. జగన్   నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా.. నిబంధనలు, నిర్బంధాలు పెట్టినా మొక్కవోని దీక్షతో రాజధాని ప్రాంత రైతులు తొలి మహా పాదయాత్రను విజయవంతంగా ముగించారు. తొలిదశలో చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది.

అదే స్ఫూర్తితో.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఇప్పుడు రైతులు మళ్లీ మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. అమరావతి పరిధి వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాద్రయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవడంతో మలి దశ మహా పాదయాత్రను ముగిస్తారు. రెండు నెలలు కొనసాగే ఈ మహా పాదయాత్ర సందర్భంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అనేక గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను ఉద్యమిస్తున్న రైతు సంఘాల జేఏసీ సిద్ధం చేసింది.  తుళ్లూరు సాయిబాబా కల్యాణ మండపంలో భేటీ అయిన రైతు సంఘాల జేఏసీ మలి దశ పాదయాత్ర ప్రారంభించే సెప్టెంబర్ 12కు ముందు రోజున దీక్షా శిబిరంలో హోమం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిగా అమరావతినే నిర్ణీత కాలంలోగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పినా ముడు ముక్కలాటకు వైసీపీ సర్కార్ తెర దించకుండా కొత్త జిత్తులు, ఎత్తులతో ముందుకు సాగుతున్నది.

కోర్టు తీర్పుతోనైనా జగన్ సర్కార్ కు జ్ఞానోదయం కలుగుతుందని ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఆశించారు. అయినా.. ప్రభుత్వం పాత పాటే పాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని ఏపీ సర్కార్ బేషరతుగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని పోరాట కమిటీ తెగేసి చెప్పింది. ఈ క్రమలోనే రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొనే మరో మహా పాదయాత్రకు రైతు సంఘాల జేఏసీ  సిద్ధం అవుతోంది. ఈ మహా పాద యాత్రలో అమరావతి రైతులకు తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెబుతున్నారు.

కాగా.. మహా పాదయాత్రకు అందరూ సహకరించాలని, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రాష్ట్రంలోని రైతులు ముందుకు రావాలని అమరావతి రైతుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, లీగల్ కమిటీ, మహిళా ఐక్య కార్యాచరణ సమితి, దళిత ఐక్య కార్యాచరణ నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలతో దిగిరాని వైసీపీ సర్కార్ కు తాజాగా తలపెట్టిన మరో మహా పాదయాత్రతోనైనా జ్ఞానోదయం అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటికై జగన్  తన మొండి పంతాన్ని వీడి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నారు.