ప‌ది మందిని కంటే రూ.13 ల‌క్ష‌లు... అమ్మ‌ల‌కు పుతిన్ ఆఫ‌ర్‌!

పూర్వం అంత‌టా సంతాన‌ల‌క్ష్ములే ఉండేవారు. దాదాపు ప్ర‌తీ ఇల్లూ పిల్ల‌ల‌తో సంద‌డిగా ఉండేది. కాల క్ర‌మంలో సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చింది. ఇపుడిక ఆధునిక పోక‌డ‌ల‌వ‌ల్ల‌, సామాజిక ప‌రిస్థితుల వ‌ల్లా ఒక్క‌రి ద్ద‌రితో స‌రిపెట్టుకుంటున్నారు.  ర‌ష్యాలో అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం మ‌ళ్లీ పిల్ల‌ల సంద‌డి అవ‌స‌ర‌మ‌ని భావించారు. అంటే జ‌నాభా పెరుగుద‌ల‌ను ఆశిస్తున్నారు. కార‌ణం కోవిడ్‌-19 కావ‌చ్చు. కోవిడ్ వ‌ల్ల  అనేక దేశాల్లో జ‌నాభా త‌గ్గిపోయింది. ర‌ష్యా కూడా దాని ప్ర‌భావానికి గురైంది.          

కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్  ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన నైరాశ్యంతో కూడిన చిట్టచివరి ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు. 

జనాభా క్షీణతను అరికట్టేందుకు పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్  అని పేరు పెట్టారు. ఈ పథకం క్రింద ప‌దిమంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయి తే ప‌ది మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి.  పదో బిడ్డకు మొదటి పుట్టినరోజు నాటికి ఒక మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు.  ఈ ఏడాది మార్చి నుంచి రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉండటం, ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల మరణించినవారి సంఖ్య 50వేల‌కు చేరుతుండ టం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 

పుతిన్ ప్రకటించిన మదర్ హీరోయిన్ పథకం నైరాశ్యంలో చేపట్టిన అంతిమ ప్రయత్నమని రష్యన్ రాజకీ య, భద్రత రంగాల నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ చెప్పారు. క్షీణిస్తున్న జనాభా సమస్యను పరిష్క రిం చేందుకు దీనిని అమలు చేస్తున్నారన్నారు. పెద్ద కుటుంబాలవారు ఎక్కు వ దేశభక్తిని కలిగి ఉంటారని పుతిన్ చెప్తున్నారని అన్నారు. ఇది సోవియెట్ యూనియన్ కాలంనాటి ప్రోత్సాహకమని చెప్పారు. అయితే ఆర్థిక సాయం కోసం పెట్టిన షరతు వింతగా ఉందన్నారు.

జనాభా తగ్గిపోతుండటం 1990వ దశకం నుంచి ప్రారంభమైందన్నారు. కోవిడ్, ఉక్రెయిన్‌పై యుద్ధం సమస్యను తీవ్రతరం చేశాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి రష్యన్ మహిళలను ప్రోత్సహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే ఈ డబ్బు కోసం ప‌ది మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళంతా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రష్యాలో చాలా ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని చెప్పారు.