అమరావతి అన్ స్టాపబుల్.. నారా లోకేష్
posted on May 2, 2025 5:16PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్ స్టాపబుల్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన నారా లోకేష్ ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతిని నిర్వీర్యం చేయడానికి శతథా ప్రయత్నించారనీ, అయితే అది వారి వల్ల కాలేదన్నారు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన జగన్ సర్కార్ చివరికి ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేకపోయిందని విమర్శించారు.
ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా మోడీయే శంకుస్థాపన చేస్తున్నారనీ, ఇక అమరావతిని ఆపే సత్తా, దమ్మూ ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు.
ఇక పుల్వామ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోడీ చర్యలకు పాకిస్థాన్ బెంబేలెత్తిపోతున్నదన్నారు. ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్ లు వచ్చినా మోడీ మిస్సైల్ ముందు నిలవలేవని లోకేష్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో యావద్దేశం మోడీకి అండగా నిలుస్తుందన్నారు.