అమరావతి శంఖుస్థాపన ద్వారా ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా?
posted on Oct 24, 2015 10:53AM
అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా దిగ్విజయంగా ముగిసింది. అయితే అది ఏ మేరకు విజయవంతం అయింది, ఆశించిన ఫలితాలు సాధించగలిగిందా లేదా..అనే విశ్లేషణలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని అంత అట్టహాసంగా నిర్వహించడం వెనుక ప్రదానోదేశ్యం యావత్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించడమే. ఈ కార్యక్రమానికి అనేక దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు వచ్చేరు కనుక ఆయా దేశాలలో ఈ కార్యక్రమం గురించి బాగానే మీడియా కవరేజ్ లభించింది కనుక ఈ విషయంలో సఫలమయినట్లే చెప్పవచ్చును.
జపాన్, సింగపూర్ దేశాలు రెండూ రాజధాని నిర్మాణంలో పెట్టుబడులు పెట్టి పాలుపంచుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసాయి. ఈ కార్యక్రమం ద్వారా సాధించిన ప్రయోజనాల్లో అదీ చాలా ముఖ్యమయినదని చెప్పవచ్చును. అదీ సఫలమయిందని స్పష్టం అయ్యింది.
కేంద్రప్రభుత్వం పరిమితంగా నిధులు ఇస్తున్నప్పుడు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరగాలంటే ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోక తప్పదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాజధానికి ఇంత “హైప్ క్రియేట్” చేసి యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసారని భావించవచ్చును. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకా ఇతర దేశాలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లయితే, వాటిని కేవలం రాజధాని కోసమే కాకుండా యావత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మరలించే అవకాశం కలుగుతుంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది.
ఇక ఈ చారిత్రిక శుభకార్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిపించడం ద్వారా ఆయనను భావోద్వేగపరిచి ఆయన చేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు కానీ మోడీ కూడా ఆయనపై అదే ఐడియా ప్రయోగించి తెలివిగా తప్పించుకొన్నారు. డిల్లీ నుంచి నీరు మట్టి తీసుకువచ్చి ఆయన చేతిలో పెట్టి, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యం నుంచి ‘నేను సైతం...’ అనే కవితని పలికి మోడీ చాలా తెలివిగా తప్పించుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోరుకొంటుంటే అయన ‘ఒట్టి మట్టి-నీళ్ళు’ ఇచ్చి వెళ్లిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సమాధానాలు, సంజాయిషీలు చెప్పుకొనే పని తెదేపా మెడకు చుట్టుకొందిపుడు.
మోడీ చేత రాజధానికి శంఖుస్థాపన చేయించడం వెనుక మరో బలమయిన కారణం కూడా ఉంది. తను శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన కావచ్చును. సాక్షాత్ దేశ ప్రధాని అమరావతికి శంఖుస్థాపన చేసినందున రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోదలచినవారికి భారత ప్రభుత్వం సహాయసహకారాలు లభిస్తాయని ప్రపంచ దేశాలకు తెలియజేసినట్లయింది.
ఇక ఈ కార్యక్రమం ద్వారా ఊహించని మరో మంచి పని కూడా జరిగింది. అదే...ఇంతకాలంగా కత్తులు దూసుకొంటున్న ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటం. ఇరువురు ముఖ్యమంత్రులు ఇంత సఖ్యతగా ఉండటం ఇదే మొదటిసారి. రాజధాని నిర్మాణం కోసం తెలంగాణా రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా భారీ ఆర్ధిక సహాయం ప్రకటించాలనుకొన్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చెపుతారో చూసిన తరువాతనే తన మనసులో మాటని బయటపెట్టడం మంచిదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గారని సమాచారం. అదే నిజమయితే ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చును. ఇక నుండి రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొన్నట్లయితే రెండు రాష్ట్రాలా ప్రజలు హర్షిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన ఆశాభంగం కలిగినప్పటికీ, ఈ కార్యక్రమం ద్వారా ఆశించిన, ఆశించని ఫలితాలు కూడా దక్కాయి కనుక ఈ శంఖుస్థాపన కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతం అయినట్లే భావించవచ్చును.