రణస్థలి నినాదం.. ఆఇద్దరి పొత్తు పక్కా !

ఆదర్శాలు ఎన్నున్నా చివరకు రాజకీయాలలో అందరి గమ్యం ఒక్కటే. అందుకు పవన్ కళ్యాణ్ మినహాయింపు కాదు. అవును పవన్ కళ్యాణ్  రాజకీయ అరంగేట్రం చేసి పది సంవత్సరాలు దాటిపోయింది. అయితే  ఈ పదేళ్ళలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతవరకు వచ్చిందంటే సమాధానం చెప్పడం కష్టమే .. అయ్యవారు ఏమి చేస్తున్నారు అంటే, చేసిన తప్పులు  దిద్దుకుంటున్నారు అన్నట్లుగా ఇంతకాలం ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది.

అయితే, రణస్థలం యువశక్తి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వివరణలు, సంధించిన అస్త్రాలు,వదిలిన పంచులు,పవన్ కళ్యాణ్ కు  రాజకీయ తత్త్వం బోధపపడిందనేలా ఉందని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయ పరిపక్వత స్పష్టంగా గోచరించిందని ఏపీ పొలిటికల్ రోడ్ మ్యాప్ ను క్లియర్ చేసిందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు  విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీ ఇచ్చారని  అంటున్నారు. 

పొత్తుల విషయంలో ఇంతవరకు కొంత మేర అటూ ఇటూ కాకుండా ఉన్న పవన్ కళ్యాణ్, రణస్థలంలో కుండ బద్దలు కొట్టేశారు. ఒంటరిగా పోటీచేసి వీర మరణం పొందవలసిన అవసరం లేదని. అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా గెలుస్తామంటే, పొత్తులు లేకుండానే పోదాం కానీ అది నేల విడిచి సాము చేయడమే అవుతుందని చెప్పకనే చెప్పారు.  మీరు అండగా వుంటానని గ్యారెంటీ ఇస్తారా అని పవన్  జన సైనికులను ప్రశ్నించారు. ఇప్పుడు ఓకే అని చెప్పి ఎన్నికలు అనగానే మా వాడు, మా కులం అని అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తాను జైనసైనికులను కుటుంబం అనుకున్నానని..  తన ఫ్యామిలీయే వదిలేస్తే తాను ఏం చేయాలని ప్రశ్నించారు. కొన్నిసార్లు ప్రత్యర్ధులని కూడా కలుపుకుని పోవాలని ఆయన వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు ఆయనలోని పరిపక్వతకు అద్దం పడుతున్నాయని రాజకీయ పండితులు, అంటున్నారు. 

నిజానికి రాజకీయాలలో ఆశయాలు, ఆదర్శాలు ఎంత అవసరమో, అవి నెరవేరే మార్గాలను ఎంచుకోవడం కూడా అంతే  అవసరమని అంటున్నారు.  ఈ నేపధ్యంలో  అందరినీ హింసించే ఒక్కడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఎంతో అలోచించి చేసిన వ్యాఖ్యగా పరిశీలకులు పేర్కొంటున్నారు.  గతంలోను అనేక  సందర్భాలలో దుష్ట సంహారం కోసం రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్క పెట్టి రాజకీయ పార్టీలు ఏకం అయిన సందర్భాలున్నాయని పరిశీలకులుఅంటున్నారు. ఇందిరా గాంధీ  అధికార దాహంలో ‘హిట్లరమ్మ’ (నియంత)లా మారి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఉత్తర దక్షిణ దృవాల వంటి పార్టీలు ఏకమై ఇందిరను ఓడించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.

అలాగే  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చి వేసినప్పుడు,ఎన్టీఆర్ కు బీజేపీ, వామపక్షాలు కుడి ఎడమన నిలిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇప్పడు ఏపీలో సాగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించేందుకు తెలుగు దేశం పార్టీతో కలిసి పనిచేయాలని జనసేన నిర్ణయం తీసుకుంటే అది తప్పు కాదని, ఒక విధంగా అది ఒక చారిత్రక అవసరమని రాజకీయ పండితులు అంటున్నారు. 

అలాగే  ఇటీవల తాను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసిన సంధర్బంలో వైసీపీ నాయకులు వ్యక్త పరిచిన ఉలికి పాటును ప్రస్తావిస్తూ బేరాలు కుదిరిపోయాయని వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పోలీసులు తనను వేధిస్తే.. చంద్రబాబు తన కోసం వచ్చి నిలబడ్డారని పవన్ తెలిపారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లి సంఘీభావం ప్రకటించానని ఆయన చెప్పారు. అలాగే, ఆ రెండున్నర గంటల్లో  ఏఏ అంశాలు చర్చించింది, వ్యగ్యం జోడించి వివరించిన పవన్ కళ్యాణ్ సీట్ల గురించి ప్రస్తావించ లేదని చెప్పారు.

అదే సమయంలో వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయక తప్పదని  స్పష్టం చేశారు, ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జన సేనకు 6.9 శాతం ఓట్లు పోలయినా, ఒక్క సీటూ రాలేదని, మరో వంక టీడీపీ, జనసేన మధ్య ఓట్ల చీలిక వలన 53 నియోజక వర్గాల్లో వైసీపీ, ‘సాంకేతిక’ విజయం సాధించిందని వివరించారు. ఈసారి  ఆ తప్పు జరగని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని మరో మారు .. స్పష్టం చేశారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తును పవన్ కళ్యాన్ పక్కా చేశారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu