70 వేల కోట్ల స్కాం... పవర్ రాగానే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పవార్‌కు ఊరట
posted on Nov 26, 2019 10:10AM
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్ర ఇరిగేషన్ స్కామ్ లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఏసిబి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. 70 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో దీని పై ఏసీబీ విచారణ జరిపింది. అయితే బిజెపితో సీక్రెట్ డీల్ లో భాగంగానే ఈ కేసును క్లోజ్ చేశారని శివసేన ఆరోపించింది. అజిత్ పవార్ ను బ్లాక్ మెయిల్ చేసి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని ఆరోపించింది. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన మరుసటి రోజే ఇరిగేషన్ స్కామ్ ఫైల్ ని ఏసీబీ మూసివేయడం తీవ్ర సంచలనం రేపుతోంది.
బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకి ఇది నిదర్శనమని శివసేన, ఎన్సీపీ నేతలు ఆరోపించారు. నవంబర్ ఇరవై ఎనిమిది న హై కోర్టు ముందు ఈ కేసు విచారణకు రానుంది. వాస్తవానికి ఎఫ్ఐఆర్ లో అజిత్ పవార్ పేరు లేదు. కాకపోతే కాంట్రాక్టులకు సంబంధించి అజిత్ పవార్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడంతో ఆయన పాత్ర పై ఏసీబీ దర్యాప్తు చేసింది. అజిత్ పవార్ కు నచ్చజెప్పడానికి ఎన్సీపీ నేతలు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఇంకా ఆయన పదవి బాధ్యతలు చేపట్ట లేదని అంటున్నారు ఎన్సీపీ నేతలు. డెప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్సీపీ కార్యకర్తలు.