కుప్పంలో బాబుకు చెక్... వైసీపీ వ్యూహంలో చిక్కనున్నాడా లేదా ??

చిత్తూరు జిల్లా కుప్పం టిడిపికి కంచుకోట.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యేగా వరుస విజయాలను అందించిన నియోజకవర్గం. అయితే ఇప్పుడు కుప్పం పై కన్నేసిన వైసిపి.. చంద్రబాబుకు చెక్ పెట్టాలని భావిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 13 స్థానాలను కైవసం చేసుకున్న వైసిపి.. కుప్పంలో సత్తా చాటాలని భావిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ ఇన్ చార్జిగా నియమించిన ఆ పార్టీ 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీకి దింపింది. గత ఎన్నికల్లో నామినేషన్ కు ప్రచారానికి దూరంగానే ఉన్నా 70,000 లకు పైగా ఓట్లు సాధించారు. జిల్లా అంతటా గత ఎన్నికల్లో చతికిల పడ్డ టిడిపి కుప్పంలో మాత్రం పరువు నిలుపుకుంది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఇన్ చార్జ్ చంద్రమౌళి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొడుకు భరత్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే కుప్పంలో వైసీపీ క్యాడర్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన మాటే అక్కడ చెల్లుతుంది. చంద్రబాబును ఓడించేందుకు ఇక్కడ ఇన్ చార్జిగా నారాయణస్వామి బాధ్యతలు చేపడతారని పెద్దిరెడ్డి ప్రకటించడం ఇప్పుడు చర్చగా మారింది. దీంతో కుప్పం వైసిపిలో కొంత గందరగోళం నెలకొంది. చంద్రమౌళి కొడుకు భరత్ ఇన్ చార్జిగా ఉంటారా..లేక నారాయణస్వామి బాధ్యతలు చూస్తారా.. అనే డౌట్లు మొదలయ్యాయి. ఇటు గతంలో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయినా రెడ్డి సుబ్రహ్మణ్యంను వైసిపిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు చంద్రమౌళిని తప్పించి కొత్త నాయకత్వం తీసుకువస్తారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. మొత్తానికి ఇన్ చార్జి విషయంలో క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.