ఏపీకి కిరణ్..! మరి, తెలంగాణకు ఎవరు? ఇంకెన్ని రోజులు నాన్చుతారు?
posted on Nov 26, 2019 9:43AM
తెలుగు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించేందుకు దాదాపు ఖరారు కాగా, తెలంగాణ విషయంలోనూ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. టీపీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి అప్పగించాలో తెలియక హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది.
పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నా... వీళ్లందరిలో రేవంతే ముందున్నారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, రేవంత్ కూడా పీసీసీ పగ్గాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక టైమ్ లో రేవంతే నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్ అన్న ప్రచారం కూడా సాగింది. అయితే, సీనియర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలతో అది ఆగిందనే మాట వినిపించింది. ముఖ్యంగా రేవంత్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి పోటీ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. దాంతో, రేవంత్... ఇతర సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అలా, తనకు మద్దతిస్తోన్న సీనియర్లతో ఢిల్లీలో రేవంత్ లాబీయింగ్ చేయిస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని బల్లగుద్దిమరీ హైకమాండ్ కి నమ్మకం రేవంత్ కలిగించారట.
ఏఐసీసీ అండ్ గాంధీభవన్ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి లేదంటే కోమటిరెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశముందని అంటున్నారు. వీళ్లిద్దరిలో ఎవరూ కాకపోతే, ఎస్సీ కోటా దామోదర రాజనర్సింహ.... మైనారిటీ కోటా షబ్బీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. అలాగే, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి, వీహెచ్ తదితరులు తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని నేతల్లో ఎవరికిచ్చినా ఫర్వాలేదు కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లకు ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికలో ఉత్తమ్ సిఫార్సు కీలకం కానుందనే మాట వినిపిస్తోంది. ఉత్తమ్ ఎవరికి మద్దతిస్తే వాళ్లకే పీసీసీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. మరి, టీపీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో... ఈ ఉత్కంఠకు ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి.