కృష్ణుడి చేయి విరిగిందని హాస్పిటల్ వెళ్లిన పూజారి..
posted on Nov 20, 2021 7:36AM
ఎవరికి గాయమైనా హాస్పిటల్ వెళతారు. దెబ్బ తగిలిన చోట చికిత్స తీసుకుంటారు. కాని ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ పూజారి.. ఆలయంలోని కృష్ణుడి విగ్రహం చేయి విరిగిందంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు పూజారి. విగ్రహానికి కట్టు కట్టాలంటూ వైద్యులను వేడుకున్నారు. మొదట డాక్టర్లు పట్టించుకోకపోవడంతో తల గోడకేసుకుని తనను తాను గాయపర్చుకున్నాడు. దీంతో చేసేదేమి లేక వైద్యులు కృష్ణుడి విగ్రహానికి కట్టు కట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన బాగా వైరల్‌గా మారింది.
అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయ పూజారి లేఖ్ సింగ్ శ్రీకృష్ణుడి విగ్రహానికి స్నానం చేయిస్తుండగా పొరపాటుగా విగ్రహం చేయి భాగం దెబ్బతింది. అంతే ఆ విగ్రహాన్ని తీసుకుని వెంటనే ఆగ్రా జిల్లా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. విగ్రహానికి కట్టుకట్టాలని అక్కడి వైద్యులను వేడుకున్నారు. ఈ వింత వాదన విన్న డాక్టర్లు ముందు పూజారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వినలేదు. దీంతో పూజారిని సంతృప్తి పరిచేందుకు డాక్టర్ కృష్ణుడి విగ్రహానికి ప్లాస్టర్ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆగ్రా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ అగర్వాల్ వివరించారు. ‘పూజారి దేవతా విగ్రహం తీసుకుని వచ్చి వైద్యం చేయమని విజ్ఞప్తి చేశారు. అతనికి ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. అయితే అతనికి హృద్రోగ సమస్యలున్నాయి. అందుకే పూజారిని ఎక్కువగా ఇబ్బందిపెట్టదలుచుకోలేదు. దీంతో పాటు అతని సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకునే ‘శ్రీ కృష్ణ’ పేరుతో పేరు నమోదు చేసుకున్నాం. ఆతర్వాత విగ్రహానికి కట్టు కట్టాం’ అన్నారు. తాను నిత్యం పూజించే విగ్రహం చేయి విరగడంతో తల్లడిల్లిన పూజారిని స్థానికులు అభినందిస్తున్నారు. దేవుడి పట్ల ఆయనకున్న భక్తిని చూసి అబ్బురపడుతున్నారు. ఇప్పుడా పూజారి ఆగ్రాలో పాపులర్ అయ్యారు.