ఆదినారాయణరెడ్డి టీడీపీ ఎంట్రీ షురూ.. మరి రామసుబ్బారెడ్డి పరిస్థితి?
posted on Oct 20, 2015 2:37PM
కడప ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి మారుతున్నారు అన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. అయితే ఆదినారాయణరెడ్డి టీడీపీ ఎంట్రీకి మధ్యలో ఉన్న రామసుబ్బారెడ్డి అనే అడ్డుపుల్ల ఇప్పుడు తొలగిపోయినట్టు తెలుస్తోంది.
రామసుబ్బారెడ్డి.. ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. అందుకే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరుతానన్న వార్త వచ్చిన వెంటనే రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆదినారాయణను పార్టీలోకి రానివ్వద్దని.. అతని వల్ల పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.. అలాంటి వారు పార్టీకి అవసరంలేదని.. ఒకవేళ ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆదినారాయణ టీడీపీ ఎంట్రీ విషయంలో కొంచం వెనక్కి తగ్గారు.
అయితే ఆదినారాయణ రెడ్డి చేరిక విషయంలో.. కడప జిల్లాలో టిడిపిని బలోపేతం చేసే చర్యల్లో భాగంగానే ఆదినారాయణరెడ్డిని చేర్చుకుందామని.. ఒకవేళ ఆదినారాయణ రెడ్డి చేరిన తమకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటామని.. చంద్రబాబు రామసుబ్బారెడ్డికి హామీ అయితే ఇచ్చారు కాని పార్టీలోకి తీసుకోను అని మాత్రం చెప్పలేదు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రామసుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తిని భేఖాతరు చేస్తూ ఆదినారాయణ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆదినారాయణతో పాటు అతని అనుచరులు.. పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలోకి చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 27 లేదా 30వ తేదీ టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో రామసుబ్బారెడ్డి తుదుపరి స్టెప్ ఏంటా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని ఒకటికి రెండుసార్లు చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు అయినా కాని చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని తీసుకోవడంతో రామసుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. తాను చెప్పినట్టు పార్టీనుండి వీడిపోతారా? అన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు రామసుబ్బారెడ్డిని ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి.